ట్రంప్ కు దారులన్నీ మూసుకుపోయినట్టేనా!

ట్రంప్ కు దారులన్నీ మూసుకుపోయినట్టేనా!

అమెరికా ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని నిరూపించేందుకు ప్రయత్నిస్తున్న ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్‌కు అక్కడి కోర్టుల్లో వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలకు సంబంధించి కీలక రాష్ట్రమైన పెన్సిల్వేనియాలో జో బైడెన్ గెలుపుపై ట్రంప్ కోరినట్టు స్టే విధించేందుకు అక్కడి ఫెడరల్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ నిరాకరించింది. 

చేసిన ఆరోపణలన్నీ వాస్తవాలైపోవు అంటూ న్యాయమూర్తులు ఈ సందర్భంగా ట్రంప్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దిగువ కోర్టు ఇచ్చిన తీర్పులపై ట్రంప్ ఫెడరల్‌ కోర్టు ఆఫ్ అప్పీల్స్‌లో కేసు దాఖలు చేశారు. అయితే.. న్యాయమూర్తులు మాత్రం ట్రంప్ కేసును కొట్టేస్తూ ఏకగ్రీవంగా తీర్పు వెలువరించారు.

ఈ సందర్భంగా న్యాయమూర్తులు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు తీవ్రమైనవే. అయితే.. ఎన్నికల ఫలితాలపై ఆరోపణలు చేసినంత మాత్రాన అవి వాస్తవాలు అయిపోవు. గారడీతో ఇత్తడిని బంగారంగా మార్చలేము’ అని వ్యాఖ్యానించారు. 

ఆరోపణలను రుజువు చేసే సాక్ష్యాలేవీ ట్రంప్ తరఫు న్యాయవాది ఇవ్వలేకపోయారని వారు తేల్చి చెప్పారు. ఈ పరిణామంతో ట్రంప్‌కు మరో ఎదురుదెబ్బ తగిలినట్టైంది. కాగా..ట్రంప్‌కు ఇటీవల కాలంలో న్యాయస్థానాల్లో వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఎన్నికల ఫలితాలపై ఆయన వేసిన డజనుకు పైగా కేసుల్లో కోర్టులు ఆయనకు వ్యతిరేకమైన తీర్పులు వెలువరించాయి. 

పోరాటం కొనసాగుతుందని ఢంకా బజాయించి చెబుతున్న ట్రంప్‌ తన‌ ఓటమిని అంగీకరించే దిశగా నెడుతున్నాయి. ఇక గత వారం పెన్సిల్వేనియా రాష్ట్ర న్యాయస్థానంలోనూ ట్రంప్‌కు పెద్ద దెబ్బే తగిలింది. అక్కడ పోలైన కొన్ని వేల ఓట్లు చెల్లవని, అవకతవకలు జరిగాయని తీర్పు ఇవ్వాలంటూ న్యాయమూర్తిని ట్రంప్ తరఫు న్యాయవాది రూడీ గిలియానీ కోరగా ఆయన సీరియస్ అయ్యారు. 

అంతేకాదు న్యాయమూర్తి సూటిగా ప్రశ్నించడంతో.. కోర్టు ముందు తను చేసిన వాదనల్లో.. ఎన్నికల్లో అవకతవలు జరిగాయని స్పష్టంగా ఎక్కడా పేర్కొనలేదని, కేవలం సాంకేతిక కారణాలు చూపించి ఓట్లు చెల్లకుండా చేసేందుకు ప్రయత్నించానని రూడీ స్వయంగా అంగీకరించాల్సి వచ్చింది. ట్రంప్ వాదనల్లో పస లేదని కూడా కోర్టు తేల్చి చెప్పింది.

అంతేకాదు.. అమెరికా సుప్రీం కోర్టుకు వెళ్లినా ఎటువంటి ఉపయోగం ఉండే అవకాశం లేదని కోర్టు అభిప్రాయపడింది. ట్రంప్‌కు ఉన్న న్యాయపరమైన అవకశాలన్నిటినీ దాదాపుగా వినియోగించుకున్నారని, అవకతవకలు జరిగాయని ఆరోపించట్లేదని వారే స్వయంగా అంగీకరించారని కోర్టు వ్యాఖ్యానించింది.

అయితే..ట్రంప్ మాత్రం సుప్రీం కోర్టు గడపతొక్కడం ఖాయమని ఆయన తరఫు న్యాయవాదులు స్పష్టం చేస్తున్నారు. మరోవంక, అధికార మార్పిడికి మార్గం సుగమం చేసిన ఆయన  అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్‌ను విజేతగా ఎలక్టోరల్‌ కాలేజీ అధికారికంగా ధ్రువీకరిస్తే తాను వైట్‌హౌస్‌ నుంచి తప్పుకొని వెళ్లిపోతానని రెండు రోజుల క్రితం ప్రకటించారు.

‘ప్రస్తుతం (జనవరి) 20వ తేదీ మధ్య చాలా విషయాలు జరగవచ్చని నేను భావిస్తున్నాను’ అని పేర్కొన్నారు. వైట్‌హౌస్‌ విజేతను నిర్ణయించే ఎలక్టోరల్ కాలేజ్ డిసెంబర్ 14న బిడెన్ గెలుపును సర్టిఫై చేయడానికి సమావేశం కానుంది. ట్రంప్ 232, బిడెన్‌కు 306 ఓట్లు వచ్చాయి.