ఇరాన్ ప్ర‌ఖ్యాత‌ అణు శాస్త్ర‌వేత్త హ‌త్య

ఇరాన్ మిలిటరీ అణు కార్యక్రమంలో కీలక పాత్ర పోషించిన శాస్త్రవేత్త ఒకరు శుక్రవారం దుండగులు ఆయనను లక్షంగా చేసుకుని జరిపిన పేలుడు పదార్థాలు, మిషన్ గన్ కాల్పుల్లో చనిపోయినట్లు ప్రభుత్వ టీవీ ప్రకటించింది. అయితే మొహ్సెన్ ఫక్రీజాదే మృతిపై వెంటనే వ్యాఖ్యానించేందుకు ఇజ్రాయెల్ నిరాకరించింది. 

ఫక్రీజాదేపై సాయుధ ఉగ్రవాద శక్తులు దాడి చేసినట్లు ప్రభుత్వ టీవీ తెలిపింది. తీవ్రంగా గాయపడిన ఆయనను కాపాడడానికి స్థానిక ఆస్పత్రి వైద్యులు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేక పోయిందని, ఆస్పత్రిలోనే ఆయన చనిపోయారని టీవీ తెలిపింది. 

దేశ రాజధాని సమీపంలోని చిన్నపాటి నగరం అబ్సర్డ్ వద్ద ఈ సంఘటన జరిగినట్లు రివల్యూషనరీ గార్డ్‌కు అత్యంత సన్నిహితమైనదిగా భావించే ఫార్స్ వార్తా సంస్థ తెలిపింది. భారీ పేలుడు శబ్దాలను, అ తర్వాత మిషన్ గన్ కాల్పుల శబ్దాలను ప్రత్యక్ష సాక్షులు విన్నట్లు ఆ వార్తాసంస్థ తెలిపింది. కాగా గాయపడిన వారిలో ఫక్రీజాదే అంగరక్షకులు కూడా ఉన్నారని, వారిని స్థానిక ఆస్పత్రిలో చేర్చినట్లు తెలిపింది. 

భద్రతా దళాలు రోడ్డును బ్లాక్ చేసిన దృశ్యాలను ప్రభుత్వ టీవీ ఆ తర్వాత తన వెబ్‌సైట్‌లో ఉంచింది. రోడ్డుపై విండ్‌షీల్డ్‌పై బులెట్ రంధ్రాలు ఉన్న ఒక నిసాన్ సెడాన్ కారును, రోడ్డుపై రక్తం మడుగు ఉన్న వీడియో చిత్రాలను కూడా ఆన్‌లైన్‌లో ఉంచారు. 

కాగా ఈ దాడికి తామే బాధ్యులమని ఏ ఉగ్రవాద సంస్థా వెంటనే ప్రకటించలేదు. ఫక్రీజాదేపై దాడి జరిగిన విషయాన్ని రివల్యూషనరీ గార్డ్ చీఫ్ కమాండర్ హొస్సేన్ సలామి కూడా పరోక్షంగా అంగీకరించారు.‘ మేము ఆధునిక సైన్స్‌ను చేరుకోకుండా అడ్డుకోవడానికి శాస్త్రవేత్తలను హత్య చేయడం అత్యంత తీవ్రమైన ఘర్షణగా మారింది’ అని ఆయన వ్యాఖ్యానించారు. 

గతంలో ఇరాన్ అణు శాస్త్రవేత్త మజీద్ షహ్రియారీ హత్య జరిగి పదేళ్లు పూర్తి కావడానికి కొద్ది రోజుల ముందు ఈ దాడి జరగడం గమనార్హం. అప్పట్లో ఆయనను ఇజ్రాయెల్ హత్య చేయించిందని అప్పట్లో ఇరాన్ ఆరోపించింది.