ఉగ్రవాదుల మెరుపుదాడిలో ఇద్దరు సైనికుల మృతి

జమ్మూ కశ్మీరులో జిల్లా అభివృద్ధి మండళ్ల(డిడిసి)కు ఎన్నికలు జరగడానికి రెండు రోజుల వ్యవధి ఉండగా గురువారం ఉదయం శ్రీనగర్-బారాముల్లా హైవేపై ఉగ్రవాదులు పట్టపగలు జరిపిన దాడిలో ఇద్దరు భారత సైనికులు మరణించారు. 
 
కేంద్ర పాలిత ప్రాంతానికి రాజధాని శ్రీనగర్ శివార్లలోని షరీఫాబాద్ వద్ద పెట్రోలింగ్ పార్టీపై ఉగ్రవాదులు జరిపిన మెరుపుదాడిలో ఇద్దరు భారత సైనికులు మరణించారు. గస్తీ బృందంపై ఉగ్రవాదులు మెరుపుదాడి జరిపి విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్లు వర్గాలు తెలిపాయి. 
 
ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు సైనికులు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు వర్గాలు చెప్పాయి. ముంబయి 26/11 దాడులు జరిగి 12 సంవత్సరాలు అయిన రోజునే భారతీయ సైన్యానికి చెందిన రోడ్ ఓపెనింగ్ పార్టీ(ఆర్‌ఓపి)పై ఉగ్రవాదుల దాడి జరగడం గమనార్హం. 
 
డిడిసి ఎన్నికలకు విఘాతం కల్పించడానికి ఉగ్రవాదులు మరిన్ని దాడులు నిర్వహించవచ్చని భద్రతా దళాలకు సమాచారం అందింది. కాగా..ఈనెల 19న జమ్మూలోని నగ్రోటా వద్ద ఒక ట్రక్కులో వెళుతున్న నలుగురు జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు భద్రతా దళాల ఎదురుకాల్పుల్లో మరణించిన విషయం తెలిసిందే.