ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో మాతృభాషలో ఇంజనీరింగ్ కోర్స్ 

ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంజనీరింగ్‌ సహా సాంకేతిక విద్యను విద్యార్థుల మాతృభాషల్లో కూడా బోధించనున్నట్లు కేంద్ర విద్యా శాఖ అధికారులు తెలిపారు. ఈ మేరకు కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ అధ్యక్షతన గురువారం జరిగిన అత్యున్నత స్థాయి సమీక్ష సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారని వారు చెప్పారు. 
 
‘సాంకేతిక విద్య.. ముఖ్యంగా ఇంజినీరింగ్‌ కోర్సులను వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థుల మాతృభాషలో కూడా బోధించడం ప్రారంభిస్తాం. దీని కోసం కొన్ని ఐఐటీ, ఎన్‌ఐటీలను ఎంపిక చేశాం’ అని సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. 
 
పాఠశాల విద్యా  బోర్డుల పరిస్థితిని మదింపు చేసిన అనంతరం  పోటీ పరీక్షల సిలబస్‌ను జాతీయ పరీక్షా సంస్థ (ఎన్‌టీఏ) రూపొందించాలని కూడా సమావేశంలో నిర్ణయించారు. జేఈఈ (మెయిన్‌), నీట్‌ (యూజీ) తదితర పరీక్షలను ఎన్‌టీఏ నిర్వహిస్తున్నది. 
 
స్కాలర్‌షిప్‌లు, ఫెలోషిప్‌లను సకాలంలో విడుదల చేయాలని యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ)కు సమావేశం సూచించింది. ఈ అంశంలో విద్యార్థుల ఫిర్యాదులను వెంటనే పరిష్కరించేందుకు హెల్ప్‌లైన్‌ను ప్రారంభించాలని నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. 
 
కాగా, 2021 నుంచి జేఈఈ  (మెయిన్‌)ను హిందీ, ఇంగ్లీషుతో పాటు 9 ప్రాంతీయ భాషల్లో నిర్వహిస్తామని ఎన్‌టీఏ గత నెలలో ప్రకటించింది.