పాతబస్తీలో ఎంఐఎం స్థానాల్లో కనిపించని కేటీఆర్ 

జీహెచ్ఎంసీ  ఎన్నికల్లో టీఆర్ఎస్, ఎంఐఎం మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని మంత్రి కేటీఆర్ చెప్పుకొంటూ వస్తున్నా పాస్తస్థిలో ఎంఐఎం స్థానాలలో ఆ పార్టీ ప్రచారం అసలు చేయడం లేదు. గత ఎన్నికల్లో మజ్లిస్ స్థానాలను తామే గెలుచున్నామని అంటూ ఆ పార్టీతో తమకు ఎలాంటి పొత్తు లేదని నమ్మించడం కోసం ఎంతో కష్ట పడుతూ వచ్చిన కేటీఆర్ పాతబస్తీలో ప్రచారానికే వెళ్లడం లేదు. 
 
రోజూ నాలుగైదు చోట్ల రోడ్ షోలు జరుపుతున్న కేటీఆర్ ఇప్పటి వరకు పాతబస్తీ వైపే చూడలేదు. చివరకు పాతబస్తీలో పోటీ చేస్తున్న   టీఆర్ఎస్ అభ్యర్థులు కూడా ప్రచారం చేయడం లేదు. ప్రచారం చేయద్దని పార్టీ పెద్దల నుంచి అభ్యర్థులకు ఆదేశాలు ఉన్నట్టు స్థానిక పార్టీ నేతలు బహిరంగంగానే చెప్తున్నారు.
ఎవరైనా కాస్త దైర్యం చేసి ప్రచారానికి వెళ్తే వెంటనే పార్టీ పెద్దల నుంచి వాళ్లకు ఫోన్లు వస్తున్నాయని, ఎందుకు ప్రచారం చేస్తున్నారని సీరియస్ అవుతున్నారని తెలుస్తున్నది. దీంతో పార్టీ ఇన్చార్జ్లు కూడా అక్కడ కాలు మోపేందుకు వెనుకడుగు వేస్తున్నారు.

ఇన్చార్జ్లుగా తమ ఉనికి చాటుకోవడం కోసం ఎవరైనా వెడితే  ‘‘సార్ ఎందుకు వచ్చారు. ఇక్కడ ప్రచారం చేయొద్దని మజ్లిస్ పార్టీ వాళ్లు అడ్డు చెప్తున్నారు. మీరు వెనక్కి వెళ్లి పోండి. గులాబీ కండువా, జెండా కనిపిస్తే గొడవ చేస్తున్నరు’’ అంటూ స్థానిక నేతలు నచ్చచెప్పి వెనుకకు పంపివేస్తున్నారు.

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో మొత్తం 150 డివిజన్లలో తమ అభ్యర్థులను బరిలోకి టీఆర్ఎస్ దింపింది. గత ఎన్నికల్లో 44 సీట్లలో గెలిచిన ఎంఐఎం  ఈసారి 51 డివిజన్లలో అభ్యర్థులను ప్రకటించింది. మజ్లిస్ పోటీ చేస్తున్న ప్రాంతాలను పట్టించుకోని టీఆర్ఎస్   మిగతా 99 స్థానాలపైనే దృష్టి సారించి ప్రచారం చేసుకొంటున్నది. 

హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలోని కొన్ని డివిజన్లలో స్థానిక ప్రజలు టీఆర్ఎస్ పట్ల ఆదరణ కనబరుస్తున్నా, అటువైపుకు వెళ్లొద్దని అభ్యర్థులకు పార్టీ అధినేతలు వారించినట్లు చెబుతున్నారు.