ఉద్రిక్తంగా రైతుల `చలో ఢిల్లీ’, చర్చలకు రాజ్‌నాథ్ సిద్ధం   

కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన నూతన వ్యవసాయ చటాట్లకు వ్యతిరేకంగా పలు రైతు సంఘాలు ఈ నెల 26, 27న చేపట్టిన ‘చలో ఢిల్లీ ’ ఆందోళన ఉద్రిక్తంగా మారింది. ఈ ఆందోళనలో పాల్గొనడం కోసం ఢిల్లీ దిశగా వందలాది ట్రాక్టర్లలో బయలుదేరిన పంజాబ్ రైతులను హర్యానా సరిహద్దుల్లో సాయుధ బలగాలు అడ్డుకున్నాయి. 

కాగా, ఆందోళనలో ఉన్న  రైతులతో చర్చించడానికి తాను సిద్ధంగా ఉన్నానని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించారు. వ్యవసాయ రంగాన్ని సరళీకృతం చేయడానికి ఇటీవల కేంద్రం రూపొందించిన చట్టాలు ఎంతో ప్రయోజనం చేకూరుస్తాయని ఆయన హామీ ఇచ్చారు. 

 ‘‘రైతులకు భరోసా కల్పించాలని నిర్ణయించుకున్నాం. మేము రైతులను మోసం చేయం అని భరోసా ఇస్తున్నాం. నేను రక్షణ శాఖా మంత్రినే. కానీ ఓ రైతు బిడ్డగా నేను రైతులను చర్చలకు ఆహ్వానిస్తున్నా.’’ అని రాజ్‌నాథ్ ప్రకటించారు. కేంద్రం తీసుకొచ్చిన నూతన చట్టాలు రైతుల ఆదాయాన్ని పెంచుతాయని, వచ్చే నాలుగైదేళ్లలో ఆ లాభాలను రైతులు చూడగలుగుతారని ఆయన  భరోసా వ్యక్తం చేశారు. 

నూతన చట్టాలు రైతులకు ఏమాత్రం హాని కలిగించవని ధీమాగా ప్రకటించగలనని, ఎందుకంటే చట్టంలోని ప్రతి పేరాను తాను క్షుణ్ణంగా చదవానని ఆయన స్పష్టం చేశారు. చట్టాలతో వ్యవసాయ మార్కెట్లేమీ నష్టపోవని, అవి కొనసాగుతూనే ఉంటాయని ప్రకటించారు. 

మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలతో కనీస మద్దుత ధరకు ఎలాంటి ముప్పూ లేదని, భవిష్యత్తులో కూడా కనీస మద్దతు ధర కొనసాగుతూనే ఉంటుందని రాజ్‌నాథ్ ప్రకటించారు.

పాటియాలా అంబాలా హైవేపై శంభు నది వంతెన వద్ద రైతులను నిలువరించారు. దీంతో ఆగ్రహించిన రైతులు భద్రతాదళాలు పెట్టిన బారికేడ్లను లాగేసి వంతెనపై నుంచి శంభు నదిలో పడేశారు. పోలీసులపై రాళ్ల దాడి చేశారు. దీంతో ఆందోళనకారులను నిలువరించేందుకు పోలీసులు భాష్పవాయు గోళాలు, వాటర్ కేనన్లు (జల ఫిరంగులు) ప్రయోగించారు. 

దీంతో హర్యానా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరుకు వంతెనపై రైతులను అడ్డుకోవడానికి పోలీసులు ఒక ట్రక్కును అడ్డంగా ఆపగా రైతులు దాన్ని నెట్టివేసి ముందుకు వెళ్లడానికి ప్రయత్నించారు. దాదాపు రెండు గంటల పోరాటం అనంతరం రైతులు హర్యానాలోకి ప్రవేశించారు. దేశ రాజధాని దిశగా కదిలారు. 

మరో వైపు రైతుల ఆందోళనకు మద్దతుగా జై కిసాన్ ఆందోళన్ వలంటీర్లతో కలిసి ఢిల్లీ వెళ్తున్న స్వరాజ్ ఇండియా నాయకుడు యోగేంద్ర యాదవ్‌ను హర్యానా పోలీసులు అడ్డుకున్నారు. జైపూర్‌ఢిల్లీ హైవేపైకి వెళ్తుండగా పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. 

మరో వైపు రైతుల ఆందోళన దృష్టా ఢిల్లీ సరిహద్దులను మూసివేశారు. ఢిల్లీహర్యానా సరిహద్దుల్లో సిఆర్‌పిఎఫ్ బలగాలను మోహరించారు. ఢిల్లీకి వచ్చే అన్ని మార్గాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు .ఢిల్లీలోకి రైతులను రానీయకుండా సోనిపట్ వద్ద సరిహద్దులను మూ సేసి బిఎస్‌ఎఫ్, సిఆర్‌పిఎఫ్ బలగాలను మోహరించారు. 

అటు రోహ్‌తక్ ఝజ్జర్ సరిహద్దులోను భారీగా పోలీసులను మోహరించారు. మరోవైపు ఢిల్లీ మెట్రో సర్వీసులను గురువారం మధ్యాహ్నం నుంచి నిలిపి వేశారు. 

మరో వైపు రైతుల ఆందోళన పొరుగు రాష్ట్రాలైన హర్యానా, పంజాబ్ రాష్ట్రాల సిఎంల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. రైతులపై హర్యానా పోలీసుల చర్యను పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ తీవ్రంగా ఖండించారు. రాజ్యాంగ దినోత్సవం రోజునే రైతుల హక్కులను ఈ విధంగా కాలరాయడం బాధాకరమని పేర్కొన్నారు.

ఢిల్లీ వెళ్తున్న రైతులను అడ్డుకోవడాన్ని గతంలో బిజెపి మిత్రపక్షమైన శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్ పంజాబ్ పాలిట 26/11గా అభివర్ణించారు. కాగా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడవద్దని, కొవిడ్ సమయంలో చౌకబారు రాజకీయాలను మానుకోవాలని హర్యానా ముఖ్యమంత్రి ఖట్టర్ పంజాబ్ సిఎంకు హితవు చెప్పారు.

చైకబారు రాజకీయాలు చేయడం మానుకోవాలని, ప్రజల ప్రాణాలను ప్రమాదంలో పడవేయవద్దని ఆయన వరస ట్వీట్‌లలో పంజాబ్ సిఎంను సూచించారు. కనీస మద్దతు ధరలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని, అదే జరిగితే రాజకీయాలు వదిలిపెడతానని తాను గతంలోనే చెప్పానని గుర్తు చేశారు. దయచేసి అమాయక రైతులను రెచ్చగొట్టడం ఆపాలని ఆయన ఆ ట్వీట్‌లలో అభ్యర్ధించారు.

ఇదిలా ఉండగా డిసెంబర్ 3న మరో దఫా చర్చలకు రావాలని కేంద్ర వ్యవసాయ మంత్రి తోమర్ ఆందోళన చేస్తున్న రైతులను కోరారు. గత నెల తొలి దఫా చర్చలు కేంద్ర మంత్రులు గైరు హాసరుతో విఫలమైనాయి. దీంతో రైతులు ఢిల్లీలో భారీ ఎత్తున ఆందోళన చేయాలని నిర్ణయించారు.