ఒకే దేశం – ఒకే ఎన్నికలు …. ప్రధాని మోదీ పిలుపు

ఒకేసారి దేశ‌వ్యాప్తంగా ఎన్నిక‌లు నిర్వ‌హించ‌డం భార‌త్‌కు అవ‌స‌రమ‌ని చెబుతూ “ఒకే దేశం – ఒకే ఎన్నికలు” ప్ర‌ధాని నరేంద్ర మోదీ పిలుపిచ్చారు.  జ‌మిలి ఎన్నిక‌ల అంశంపై కేవ‌లం చ‌ర్చ మాత్ర‌మే కుద‌ర‌దు అని, ఇప్పుడు ఆ విధానం భార‌త్‌కు ఎంతో అవ‌స‌రమ‌ని ఆయ‌న స్పష్టం చేశారు. 
 
గుజరాత్‌లోని కేవడియాలో జరిగిన అఖిల భారత ప్రిసైడింగ్ ఆఫీసర్స్ 80వ సమావేశానికి ఆయన వర్చ్యువల్ సందేశం ఇస్తూ ప్ర‌తి కొన్ని నెల‌ల‌కు ఒక‌సారి ఏదో ఒక ప్ర‌దేశంలో ఎన్నిక‌లు జరుగుతున్నాయ‌ని,  ఆ ఎన్నిక‌ల ప్ర‌భావం అభివృద్ధి ప‌నుల‌పై ఎటువంటి ప్ర‌భావం చూపుతుందో తెలుస‌ని గుర్తు చేశారు.
ఈ అంశాన్ని క్షుణ్ణంగా ప‌రిశీలించాల‌ని,  దానికి ప్రిసైడింగ్ ఆఫీస‌ర్లే మార్గ‌ద‌ర్శ‌కుల‌వుతార‌ని ప్ర‌ధాని మోదీ చెప్పారు.   అసెంబ్లీ, స్థానిక సంస్థలు, లోక్‌సభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం వేర్వేరు ఓటరు జాబితాలను రూపొందిస్తోందని, అలా రూపొందించడం అంటే వనరులను వృథా చేయడమే అని పేర్కొన్నారు. 
 
మ‌న రాజ్యాంగంలో ఎన్నో అంశాలు ఉన్నాయ‌ని, అయితే విధులు నిర్వ‌ర్తించ‌డ‌మే కీల‌క‌మైన అంశ‌మ‌ని ప్రధాని తెలిపారు.  విధుల నిర్వ‌హ‌ణపై మ‌హాత్మా గాంధీ చాలా ప్ర‌త్యేక‌మైన దృష్టి పెట్టార‌ని,  హ‌క్కులు-విధుల మ‌ధ్య స‌న్నిహిత సంబంధం ఉంద‌ని గాంధీ గుర్తించార‌ని ఆయ‌న చెప్పారు. 
 
 మ‌నం మ‌న విధుల‌ను నిర్వ‌ర్తిస్తే, అప్పుడు మ‌న హ‌క్కులు ఆటోమెటిక్‌గా ర‌క్షింప‌బ‌డుతాయ‌ని ప్ర‌ధాని స్పష్టం చేశారు. 2008లో ఇదే రోజున పాక్‌కు చెందిన ఉగ్ర‌వాదులు ముంబైపై దాడి చేశార‌ని, విదేశీ పౌరులు, పోలీసులు ఆ దాడిలో చ‌నిపోయార‌ని గుర్తు చేశారు.  వారంద‌రికీ నివాళి అర్పిస్తున్న‌ట్లు మోదీ చెప్పారు. 
 
ఆ గాయాల‌ను భార‌త్ ఎన్న‌టికీ మ‌రిచిపోదని అంటూ ఉగ్ర‌వాదాన్ని భార‌త్ కొత్త విధానాల‌తో ఎదుర్కొంటోంద‌ని స్పష్టం చేశారు. ఉగ్ర‌వాదుల‌తో పోరాడుతున్న భ‌ద్ర‌తా ద‌ళాల‌కు శిర‌స్సు వంచి న‌మ‌స్క‌రిస్తున్న‌ట్లు ప్ర‌ధాని తెలిపారు.