ఎన్నికల ముందు మమతకు సీనియర్ మంత్రి షాక్ 

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీకి వరుస షాక్‌లు తగులుగున్నాయి. ఓ వైపు ఇవాళ టీఎంసీ సీనియర్ నేత సువేందు అధికారి మంత్రి పదవికిరాజీనామా చేయగా.. మరోవైపు ఆ పార్టీ అసంతృప్త ఎమ్మెల్యే మిహిర్ గోస్వామి ఢిల్లీ పయనమయ్యారు. 
 
బీజేపీ ఎంపీ నిశిత్ ప్రమాణిక్‌తో కలిసి శుక్రవారం ఉదయం ఆయన హస్తినకు బయల్దేరి వెళ్లారు.    టీఎంసీ సీనియర్ నేత రవీంద్రనాథ్ ఘోష్ తన ఇంటిని సందర్శించిన రెండు రోజుల తర్వాత నిన్న గోస్వామి స్పందిస్తూ.. ఇక తాను టీఎంసీలో కొనసాగడం కష్టమని కుండబద్దలు కొట్టారు. 
 
ఆ పార్టీలో జరుగుతున్న అవమానాలను తట్టుకునే శక్తి ఇక తనకు లేదని ఆయన పేర్కొన్నారు. కూచ్‌బేహార్ దక్షిణ్ నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్న గోస్వామి అక్టోబర్‌లో ఎంపీ ప్రమాణిక్ ఇంటికి వెళ్లినప్పుడే ఆయన కమలదళంలో చేరడం ఖాయమన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
 
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమత బెనర్జీకి ఎదురుదెబ్బ తగిలింది. సీనియర్ మంత్రి సివేందు అధికారి తన పదవికి రాజీనామా చేశారు. సీఎం మమతకు ఈ ఉదయం తన రాజీనామా లేఖను అందించారు. మరో కాపీని గవర్నర్ జగ్‌దీప్ ధన్‌కర్‌కు పంపారు. 
 
రవాణా, నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న సివేందు తన పదవికి మాత్రమే రాజీనామా చేశారు. తృణమూల్ ఎమ్మెల్యేగా మాత్రం కొనసాగుతారు. ఆయితే, ఆయన త్వరలోనే పార్టీని కూడా వీడే అవకాశం ఉందని తెలుస్తోంది.  
 
నందిగ్రామ్ ఎమ్మెల్యే అయిన సివేందు గత రెండుమూడు నెలలుగా పార్టీతో అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. పార్టీ, కేబినెట్ సమావేశాలకు డుమ్మా కొడుతున్నారు. ఇటీవల ఆయన అనేక ర్యాలీలు నిర్వహించినప్పటికీ అందులో తృణమూల్ పార్టీ జెండాలు కానీ, బ్యానర్లు కానీ, మమత ఫొటోలు కానీ లేకపోవడం గమనార్హం. 
 
మమత బెనర్జీ మేనల్లుడు, లోక్‌సభ సభ్యుడు అభిషేక్ బెనర్జీకి పార్టీలో ప్రాముఖ్యం దక్కడంపై సివేందు అసంతృప్తిగా ఉన్నప్పటికీ ఆ విషయాన్ని ఆయన ఎప్పుడూ బహిరంగంగా వెల్లడించలేదు. అయితే బీజేపీలో చేరబోతున్నట్లు కొంతకాలంగా కధనాలు వెలువడుతున్నాయి. 

 ‘‘నేనేమీ పారాచుట్ ద్వారానో, లిఫ్ట్ ఎక్కో రాలేదు. మెట్లు ఎక్కి వచ్చాను. ఒక్కోసారి ఒక్కో మెట్టు మాత్రమే ఎక్కి వచ్చాను’’ సివేందు అధికారి ఇటీవల ఓ బహిరంగ సమావేశంలో పేర్కొన్నారు. అయితే ఆయన ఎమ్మెల్యే పదవికి కానీ, పార్టీకి కానీ రాజీనామా చేయలేదని, ఆయనకు పార్టీని వీడే ఉద్దేశం లేదని తృణమూల్ సీనియర్ నేత, ఎంపీ సౌగత్ రాయ్ పేర్కొనడం గమనార్హం.