
రిపబ్లిక్ టీవీ ఎడిటర్-ఇన్-చీఫ్ అర్నాబ్ గోస్వామికి మంజూరు చేసిన తాత్కాలిక బెయిలు గడువును సుప్రీంకోర్టు శుక్రవారం మరో నాలుగు వారాలు పొడిగించింది. ఆర్కిటెక్ట్ అన్వయ్ నాయక్, ఆయన తల్లి ఆత్మహత్య చేసుకునేవిధంగా ప్రేరేపించినట్లు నమోదైన కేసులో అర్నాబ్ గోస్వామికి సుప్రీంకోర్టు ఈ నెల 11న తాత్కాలిక బెయిలు మంజూరు చేసిన సంగతి తెలిసిందే.
వారం రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీలో గడిపిన అనంతరం అర్నాబ్ బెయిలుపై విడుదలయ్యారు. ఈ బెయిలు మంజూరుకుగల కారణాలను జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఇందిరా బెనర్జీ ధర్మాసనం వివరించింది.
పైగా, ఆర్కిటెక్చరల్ ఫర్మ్ అధిపతి ఆత్మహత్య చేసుకునే విధంగా అర్నాబ్ గోస్వామి తదితరులు (అపీలుదారులు) ప్రేరేపించినట్లు చెప్పలేమని జస్టిస్ చంద్రచూడ్ స్పష్టం చేశారు. బాంబే హైకోర్టు ఈ కేసుపై ప్రాథమికంగా విలువకట్టినప్పటికీ, ఎఫ్ఐఆర్, ఐపీసీ 306 మధ్య సంబంధం లేదన్న విషయాన్ని గ్రహించలేకపోయిందని తెలిపారు.
అర్నాబ్ గోస్వామిపై ఆరోపణలను మహారాష్ట్ర పోలీసులు నిరూపించలేకపోయారని కూడా పేర్కొన్నారు. ఎఫ్ఐఆర్, ఆత్మహత్యకు ప్రేరేపించిన నేరానికి ఉండవలసిన అంశాల మధ్య సంబంధం లేదని చెప్పారు. బాంబే హైకోర్టు తన అధికారాన్ని వినియోగించడంలో విఫలమైందని చెప్పడం గమనార్హం.
రాజ్యాంగ విలువలను, ప్రాథమిక హక్కులను కాపాడవలసిన రక్షకురాలిగా తన పాత్రను హైకోర్టు పరిత్యజించిందని అభిప్రాయపడ్డాయిరు. రాజ్యం తన అధికారాలను దుర్వినియోగం చేస్తున్నట్లు ప్రాథమికంగా నిరూపించే పౌరులకు ఈ కోర్టు తలుపులు మూసివేయరాదని స్పష్టం చేశారు.
‘‘వివిధ అంశాలలో తన అభిప్రాయాల కారణంగా 2020 ఏప్రిల్ నుంచి తనను లక్ష్యంగా చేసుకుంటున్నారని అర్నాబ్ గోస్వామి చెప్పారు. అయితే ఇక్కడ, రాజ్యాంగ విలువలు, ప్రాథమిక హక్కుల రక్షకురాలి పాత్రను హైకోర్టు పరిత్యజించింది. ఎంపిక చేసుకుని వేధించే సాధనంగా క్రిమినల్ చట్టం ప్రజల విషయంలో మారకూడదు’’ అని సుప్రీంకోర్టు పేర్కొంది.
ఆర్కిటెక్ట్ నాయక్, ఆయన తల్లి ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రేరేపించారన్న ఆరోపణలపై అర్నాబ్ గోస్వామిని, మరో ఇద్దరిని మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. వీరిని నవంబరు 4న అరెస్టు చేశారు. గోస్వామి బెయిలు కోసం దరఖాస్తు చేయగా బాంబే హైకోర్టు అందుకు నిరాకరించింది. నవంబరు 9న ఇచ్చిన ఆదేశాల్లో అలీబాగ్‌లోని సెషన్స్ కోర్టులో దరఖాస్తు చేయాలని చెప్పింది.
కనీసం ఒక రోజు అయినా వ్యక్తిగత స్వేచ్ఛను పోగొట్టడం చాలా తీవ్రమైన విషయమని సుప్రీంకోర్టు తెలిపింది. బెయిలు దరఖాస్తులపై విచారణ జరిపేటపుడు ఆలస్యం జరగడానికి కారణమయ్యే సంస్థాగత సమస్యలను పరిష్కరించవలసిన అత్యవసర పరిస్థితి కోర్టులకు ఉందని తెలిపింది.
క్రిమినల్ చట్టం ప్రజలను ఎంపిక చేసుకుని వేధించే సాధనంగా మారకుండా సుప్రీంకోర్టు, హైకోర్టులు, జిల్లా న్యాయ వ్యవస్థ జాగ్రత్తవహించాలని పేర్కొంది. నాయక్, ఆయన తల్లి ఆత్మహత్య కేసు 2018నాటిది. ఈ కేసును మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ పోలీసులు తిరిగి తెరిచారు.
నాయక్ నడుపుతున్న ఆర్కిటెక్చరల్ సంస్థకు అర్నాబ్ గోస్వామి, తదితరులు చెల్లించవలసిన సొమ్మును చెల్లించకపోవడంతో వీరు ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ఆరోపించారు. ఈ కేసులో గోస్వామితోపాటు మరో ఇద్దరికి కూడా తాత్కాలిక బెయిలు మంజూరైంది.
More Stories
ఉగ్రదాడి సాకుతో జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదా అడగను
గాయని నేహా రాథోడ్‌పై దేశద్రోహం కేసు
దశాబ్దం తర్వాత లెఫ్ట్ కంచుకోట జె ఎన్ యు లో ఎబివిపి పాగా!