రాజకీయాలు పక్కన పెట్టి కోవిద్ ఎదుర్కొనండి 

ప్రభుత్వాలు రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలని సుప్రీంకోర్టు శుక్రవారం హితవు పలికింది. రాజకీయాలను పక్కనబెట్టి కోవిడ్-19 మహమ్మారిని నిరోధించేందుకు పటిష్ట చర్యలు చేపట్టాలని పేర్కొంది. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో గురువారం ఓ కోవిడ్ ఆసుపత్రిలో సంభవించిన అగ్నిప్రమాదంపై అత్యున్నత న్యాయస్థానం స్వీయ విచారణ జరుపుతోంది.

 దేశంలో కోవిడ్ పరిస్థితి రాన్రానూ దయనీయంగా మారుతోందని, రాష్ట్రాలు రాజకీయాలకు అతీతంగా స్పందించి, పటిష్ట చర్యలు తీసుకోవాలని తెలిపింది. జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ అగ్ని ప్రమాదంపై స్వీయ విచారణ జరుపుతోంది. తదుపరి విచారణ మంగళవారం జరుగుతుందని, ఆ రోజున సవివరమైన స్పందనను సమర్పించాలని గుజరాత్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. 

కోవిడ్ ఆసుపత్రుల్లో అగ్ని ప్రమాదాలు సంభవించడం ఇదే మొదటిసారి కాదని, గతంలో అహ్మదాబాద్‌లోనూ, ఆంధ్ర ప్రదేశ్‌లోనూ కోవిడ్ ఆసుపత్రుల్లో అగ్ని ప్రమాదాలు జరిగాయని గుర్తు చేసింది. ఈ ప్రమాదాల్లో రోగులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. అగ్ని ప్రమాదాలను నివారించడానికి ఎటువంటి చర్యలను తీసుకోవడం లేదని పేర్కొంది. 

తనకు రిపోర్టుల మీద ఆసక్తి లేదని, కేంద్ర ప్రభుత్వం కోవిడ్-19 ఆసుపత్రుల్లో తనిఖీలు చేసి, ఇటువంటి సమస్యలకు కారణాలను తెలుసుకోవాలని తెలిపింది. కోవిడ్-19 మార్గదర్శకాలను కఠినంగా అమలు చేయాలని తెలిపింది. ప్రతి రోజూ పండుగ సంబరాలు, ఊరేగింపులు జరుగుతున్నాయని, దాదాపు 60 శాతం మంది మాస్క్‌లు ధరించడం లేదని, 30 శాతం మంది తమ మాస్క్‌లను వేలాడదీసి ఉంచుతున్నారని పేర్కొంది. 

కొన్ని కఠిన చర్యలు తీసుకోవలసిన సమయం ఆసన్నమైందని పేర్కొంది. నవంబరు నుంచి పరిస్థితి మరింత దిగజారిందని పేర్కొంది. కఠినమైన చర్యలు తీసుకోకపోతే, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కృషి నిష్ఫలం అవుతుందని పేర్కొంది. 

సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ, అగ్ని ప్రమాదం సంభవించడం చాలా తీవ్రమైనదన్నారు. కోర్టు వ్యక్తం చేసిన ఆందోళనను పరిష్కరించేందుకు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు రాష్ట్రాలు తమ కృషిని మరింత పెంచాలని చెప్పారు. 

పది రాష్ట్రాల్లో అత్యధిక సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయని, ఈ రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు మరింత ఎక్కువగా కృషి చేయాలని చెప్పారు. దీనిపై సుప్రీంకోర్టు స్పందిస్తూ రాష్ట్రాలు రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలని తెలిపింది. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేస్తోందని, రాష్ట్రాలు ఎక్కడ అమలు చేస్తున్నాయని ప్రశ్నించింది.

కోవిడ్-19కు ఇప్పటికీ మందు లేదనేది కఠోర వాస్తవమని తెలిపింది. వ్యాక్సిన్ ప్రయోగ దశలో ఉందని, అయినప్పటికీ భౌతిక దూరాన్ని పాటించడం లేదని పేర్కొంది. ప్రజలు ఒక చోట అధికంగా చేరకుండా నిరోధించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని తెలిపింది.