అదానీపై లంచం కేసును కొట్టివేతకు అమెరికా కోర్టు నిరాక‌ర‌ణ‌

అదానీపై లంచం కేసును కొట్టివేతకు అమెరికా కోర్టు నిరాక‌ర‌ణ‌

బిలియ‌నీర్ గౌతమ్ అదానీపై నమోదైన హై-ప్రొఫైల్ లంచం కేసులో అమెరికా ఫెడ‌ర‌ల్ కోర్టులో  ఫెడరల్ జడ్జి అదానీతోపాటు ఇతర నిందితులపై ఉన్న క్రిమినల్ ఆరోపణలను తక్షణమే కొట్టివేసేందుకు నిరాకరించారు. ఈ కేసును ఎందుకు ఉపసంహరించుకోవాలని అనుకుంటున్నారో తెలుపుతూ మరింత స్పష్టమైన, వివరణాత్మకమైన నివేదికను సమర్పించాలని అమెరికా జస్టిస్ డిపార్ట్‌మెంట్‌ను కోర్టు ఆదేశించింది. 

 
బ్రూక్లిన్‌ లోని యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి కోలస్ గరాఫిస్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. అదానీపై ఉన్న అభియోగాలను ఉపసంహరించుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా న్యాయ శాఖ ప్రకటించిన నెలరోజులకే ఈ ఈ పరిణామం చోటుచేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. కేసును ఉపసంహరించుకోవాలంటూ మే 18న జస్టిస్ డిపార్ట్‌మెంట్ దాఖలు చేసిన పిటిషన్ చాలా క్లుప్తంగా, ఎలాంటి బలమైన కారణాలు లేకుండా ఉందంటూ ఆయన అసంతృప్తి వ్యక్తంచేశారు. 
 
కేసును ఎందుకు డ్రాప్ చేయాలనుకుంటున్నారో సరైన ఆధారాలు, కారణాలతో కూడిన నివేదికను జూలై 13 లోగా కోర్టుకు సమర్పించాలని ప్రాసిక్యూటర్లను ఆదేశించారు.  ఈ కేసును తక్షణమే కొట్టివేయాలని అదానీ తరఫు న్యాయవాదులు ఈ వారం కోర్టును ఆశ్రయించారు. 
 
2024లో అప్పటి అధ్యక్షుడు జో బైడెన్ హయాంలో దాఖలైన ఈ కేసులో, అదానీ గ్రూప్ అనుబంధ సంస్థ ఒక సౌర విద్యుత్ ప్రాజెక్టుకు అనుమతులు పొందడం కోసం, భారత ప్రభుత్వ అధికారులకు లంచాలు చెల్లించడానికి అంగీకరించారని ఆరోపణలు ఉన్నాయి. కంపెనీ అవినీతి నిరోధక పద్ధతులను వాస్తవంగా ఉన్నదానికంటే మరింత అనుకూలంగా చిత్రీకరించి, అదానీ అమెరికా పెట్టుబడిదారులను తప్పుదోవ పట్టించారని కూడా ప్రాసిక్యూటర్లు ఆరోపించారు.
 
అయితే ఈ ఆరోపణలను అదానీ గ్రూప్ మొదటి నుంచీ తీవ్రంగా ఖండిస్తూ వ‌స్తోంది.  తమపై నమోదైన కేసుకు చట్టపరమైన ఆధారం లేదని, ఆరోపించిన చర్యలు అమెరికా చట్టాల పరిధిలోకి రావని అదానీ తరఫు న్యాయవాది రాబర్ట్ గిఫ్రా వాదించారు. భారతదేశంలో జరిగినట్లు ఆరోపిస్తున్న లంచం వ్యవహారాన్ని అమెరికా ప్రాసిక్యూషన్ నిరూపించలేదని పేర్కొన్నారు. 
 
మే నెలలో ట్రంప్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసుపై మరింత సమయం, వనరులను కేటాయించలేమని పేర్కొంటూ కేసును పూర్తిగా ఉపసంహరించుకోవాలని జస్టిస్ డిపార్ట్‌మెంట్ భావించింది. జూన్ 24న అదానీ తరపు న్యాయవాదులు కూడా ఈ కేసు అమెరికా అధికార పరిధిలోకి రాదని, లంచం ఇచ్చినట్లు నిరూపించడానికి తగిన ఆధారాలు లేవని పేర్కొంటూ కేసును అధికారికంగా కొట్టివేయాలని కోర్టును కోరారు. 
 
అయితే దీనిపై తుది నిర్ణయం తీసుకునే ముందు ప్రభుత్వం నుంచి పూర్తి వివరణ కావాలని న్యాయమూర్తి స్పష్టంచేశారు. ఈ క్రిమినల్ కేసు ప్రక్రియ ఇలా ఉండగా దీనికి సమాంతరంగా నడుస్తున్న సివిల్ వివాదాల పరిష్కారానికి అదానీ గ్రూప్ అంగీకరించింది. ఇందులో భాగంగా గౌతమ్ అదానీ 6 మిలియన్ డాలర్లు, సాగర్ అదానీ 12 మిలియన్ డాలర్ల మేర సివిల్ సెటిల్‌మెంట్ కింద చెల్లించే ప్రతిపాదనలు కోర్టు అనుమతి కోసం వేచి ఉన్నాయి. 
 
ఇవి కాకుండా ఇరాన్ నుంచి ద్రవీకృత పెట్రోలియం గ్యాస్ దిగుమతులకు సంబంధించి అమెరికా ఆంక్షలను ఉల్లంఘించారనే ఆరోపణల పరిష్కారానికిగాను అదానీ ఎంటర్‌ప్రైజెస్ అమెరికా ట్రెజరీకి 275 మిలియన్ డాలర్లు చెల్లించడానికి ఒప్పుకుంది.