తెలంగాణలో కేసీఆర్ పాలనకు ముగింపు 

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో ప్రజల స్పందన చూస్తుంటే తెలంగాణలో కేసీఆర్ పాలనకు ముగింపు పలుకుతున్నట్లు స్పష్టం అవుతున్నదని బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా తెలిపారు. శుక్రవారం జోరున వర్షంలో కొత్తపేట నుండి నాగోల్ వరకు రోడ్ షో నిర్వహిస్తూ ప్రతి డివిజన్‌లో కమలం జెండా రెపరెపలాడుతుందని చెప్పారు.
 
హైదరాబాద్‌ను అభివృద్ధిలో మరింత ముందుకు తీసుకెళ్తామని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు. తెలంగాణను అప్పుల మయంగా మార్చారని విమర్శించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కొత్త హామీలతో కేసీఆర్ ప్రజలను మభ్యపెడుతున్నారని ఎద్దేవా చేశారు. 
 
తెలంగాణలో టీఆర్ఎస్ పని అయిపోయిందని, ప్రజలు గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు తగిన గుణపాఠం చెబుతారని ధీమా వ్యక్తం చేశారు.  గల్లీ ఎన్నికలకు ఢిల్లీ నేతలు వస్తున్నారని కేటీఆర్ విమర్శిస్తున్నారని వారి డ్రామాలు ఇకమీదట సాగవని జేపీ నడ్డా మండిపడ్డారు. టీఆర్ఎస్ పాలనకు ప్రజలు త్వరలోనే చరమగీతం పాడుతారని చెప్పారు.
 
జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకుగాను నడ్డా  ప్రత్యేక వినానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న నడ్డాకు ఎమ్మెల్యే రాజాసింగ్, పెద్దిరెడ్డి, కన్నా లక్ష్మినారాయణ స్వాగతం పలికారు. నడ్డా బేగంపేట నుంచి నేరుగా కొత్తపేటకు చేరుకోనున్నారు. అక్కడ కొత్తపేట చౌరస్తా నుంచి నాగోల్ వరకు జరిగే రోడ్ షో లో నడ్డా పాల్గొన్నారు. 
 
 బీజేపీ జీహెచ్‌ఎంసీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. అతిరథ మహారథులందరినీ హైదరాబాద్‌లో దించుతోంది. గ్రేటర్‌పై పూర్తి ఫోకస్‌ పెట్టింది. గెలుపు కోసం సర్వశక్తులూ ఒడ్డుతోంది. ఒక కార్పొరేషన్‌ ఎన్నికకు బీజేపీ ఇంత ప్రాధాన్యతనివ్వడం ఇదే ప్రధమం కావడం గమనార్హం. 
 
దుబ్బాక విజయం ఇచ్చిన ఊపు బీజేపీలో నయాజోష్‌ నింపింది. ఈసారి ఎలాగైనా బల్దియాపై కాషాయ జెండా ఎగురవేయాలని బీజేపీ భావిస్తోంది. అందుకనుగుణంగా తమ వ్యూహాలకు కూడా పదునుపెట్టింది. ప్రచారంపై దృష్టి పెడుతూ మరోవైపు ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్‌లోని అసంతృప్తి నేతలకు గాలం వేస్తోంది.
 
ఇప్పటికే నగరంలో పార్టీ జాతీయ నాయకులు స్మ్రితి ఇరానీ,యువమోర్చ జాతీయ అధ్యక్షుడు తేజస్వి సూర్య, దేవేంద్ర ఫడ్నవిస్ పర్యటన జరపగా, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా కూడా చివరి రెండు రోజులలో పర్యటిస్తున్నారు.