
తమిళనాడు, పుదుచ్చేరి ప్రాంతాలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్న ‘నివర్’ తుపాను తీరం దాటి, పుదుచ్చేరికి సమీపంలో అతి తీవ్ర తుపాను నుంచి తీవ్ర తుపానుగా పరిణమించింది. బుధవారం రాత్రి 11.30 గంటల నుంచి గురువారం తెల్లవారుజామున 2.30 గంటల మధ్య నివర్ తుపాను తీరం దాటినట్లు వాతావరణశాఖ తెలియజేసింది.
తుపాను తీరం దాటక గంటకు 120 నుంచి 145 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు వివరించారు. మరోవైపు ఈ తుపాను తమిళనాడు, పుదుచ్చేరిలపై తీవ్ర ప్రభావం చూపనుందని తెలుస్తోంది.
తుఫాను ప్రభావంతో తమిళనాడులోని తిరువణ్ణామలై, కడలూర్, కల్లకురిచ్చి, విలుప్పుంలలో మరో 3 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. తుఫాను తీరం దాటే సమయంలో వీచిన గాలులకు భారీ వృక్షాలు నెలకొరిగాయి. పంటలకు భారీ నష్టం వాటిల్లింది.
దీని ప్రభావంతో పుదుచ్చేరితోపాటు, తమిళనాడులోని చెన్నై సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పుదుచ్చేరిలో 237 మిల్లీమీటర్లు, తమిళనాడులోని కడలూరులో 237 మిల్లీమీటర్ల చొప్పున, రాజధాని చెన్నైలో భారీ వర్షం కురిసింది. తుఫాను ప్రభావంతో తమిళనాడులో ఇప్పటివరకు 1.45 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
రాష్ట్రంలో 1,516 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రజలు ఇళ్లనుంచి బయటకు రావద్దని సీఎం పళని స్వామి విజ్ఞప్తి చేశారు. పుదుచ్చేరిలో కురిసిన భారీ వర్షంతో వీధుల్లో పెద్దఎత్తున నీరు నిలిచింది. సీఎం నారాయణ స్వామి ఇళ్లు వరదనీటిలో మునిగిపోయింది.
తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు, కర్నూలు, ప్రకాశం, కడప జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. గాలులు తీవ్రంగా వీస్తుండటంతో భారీ వృక్షాలు సైతం నేలకొరిగాయి. తుఫాను ప్రభావం ఎక్కువగా ఉన్న నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాలకు సహాయక చర్యల కోసం ఐదు ఎస్డీఆర్‌ఎఫ్, నాలుగు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచారు.
ఇల్లు సురక్షితం కాకపోతే పునరావాస కేంద్రాలకు వెళ్లాలని విపత్తు నిర్వహణ శాఖ సూచించింది. రైతులు అప్రమత్తంగా ఉండి, పంట సంరక్షణకు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. చిత్తూరు జిల్లాలో తుఫాను ప్రభావంపై అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లాలోని తూర్పు ప్రాంతాల్లో తుఫాను ప్రభావం అధికంగా ఉంటుందనే అంచనాతో సహాయకచర్యలు చేపట్టారు. సత్యవేడు నియోజకవర్గం పరిధిలో 340 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
More Stories
పహల్గాం ఉగ్రదాడిలో హమాస్ హస్తం?
కాశ్మీర్ లోయలో ఐదుగురు ఉగ్రవాదుల ఇళ్ల పేల్చివేత
వక్ఫ్ సవాల్ చేసిన పిటిషన్లను కొట్టివేయాలని కోరిన కేంద్రం