అంతర్జాతీయ విమానాలపై నిషేధం పొడిగింపు 

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో  కేంద్ర ప్రభుత్వం మరోసారి అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై నిషేధం విధించింది. అంతర్జాతీయ విమానాల రద్దును డిసెంబర్‌ 31 వరకు పొడిగిస్తున్నట్లు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డిజిసిఎ) గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. 
 
కార్గో (వస్తు రవాణా) విమానాలకు ఈ నిబంధన వర్తించదని ఆ సర్క్యులర్‌లో పేర్కొంది. ఎంపిక చేసిన మార్గాల్లో మాత్రమే సమయం, పరిస్థితులను పరిశీలించిన అనంతరం విమాన సర్వీసులను అనుమతిస్తామని డిజిసిఎ తెలిపింది. 
 
26.9.20 నాటి సర్క్యులర్‌ను పాక్షికంగా సవరిస్తూ.. భారత్‌ నుండి ఇతర దేశాలకు, అలాగే ఇతర దేశాల నుండి భారత్‌కు ప్రయాణించే అంతర్జాతీయ ప్రయాణికుల విమానాలను డిసెంబర్‌ 31 వరకు రద్దు చేస్తున్నట్లు డిజిసిఎ తెలిపింది. 
 
అంతర్జాతీయ విమాన యానం, వీసా నిబంధనలకు సంబంధించి నవంబర్‌ 30 వరకు ఉన్న నిషేధాన్ని కూడా మరో నెలపొడిగిస్తున్నట్లు డిజిసిఎ తెలిపింది.