మనీలాండరింగ్‌ కేసులో గుజరాత్ మీడియా డైరెక్టర్   

మనీలాండరింగ్‌ కేసులో గుజరాత్‌కు చెందిన సంకేత్‌ మీడియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ డైరెక్టర్‌ పివిఎస్‌ శర్మను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ శుక్రవారం అరెస్టు చేసింది. డిసెంబరు 2 వరకూ శర్మ ఈడి అదుపులో ఉంటారు.

సంకేత్‌ మీడియా సంస్థ సత్యం టైమ్‌ అనే దిన పత్రికను గుజరాతీ, ఇంగ్లీషు ఎడిషన్లలో ప్రచురిస్తుంది. క్రిమినల్‌ నేరాల ద్వారా వచ్చే ఆదాయాన్ని సంస్థ ద్వారా మనీలాండరింగ్‌కు పాల్పడుతున్నట్లు శర్మ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 

సూరత్ బిజెపి ఉపాధ్యక్షుడైన శర్మ మాజీ ఆదాయపన్ను అధికారి. సురత్‌ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ అధారంగా ఈ కేసును ఈడి విచారణ చేస్తుంది. ఈ పత్రిక గుజరాతీ, ఇంగీష్లు కాఫీలు వాస్తవంగా రోజుకు 300-600, 0-290 మాత్రమే అమ్ముడవుతుంటే లెక్కల్లో మాత్రం 23,500, 6,000-6,300గా చూపుతున్నారని ఈడి తెలిపింది. 

ఇందుకోసం నకిలీ ఖాతాల పుస్తకాలు, తప్పుడు ఎంట్రీలు, నకిలీ డాక్యుమెంట్లు సృష్టించినట్లు తెలిపింది. ప్రభుత్వాన్ని, ప్రైవేటు ప్రచార సంస్థల్ని సంకేత్‌ సంస్థ మోసం చేస్తుందని ఈడి ఆరోపిస్తుంది. గత అక్టోబర్ లో ఆదాయపన్ను అధికారుల సోదాలలో లెక్కకు రాని ఆదాయం, బినామీ ఆస్తులను కనుగొన్నారు.