మహారాష్ట్రలో బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం 

మహారాష్ట్రలో అధికారంలో ఉన్న మహా వికాస్ అఘాడి (ఎంవిఎ) ప్రభుత్వాన్ని ”అసహజ పొత్తు”గా మాజీ ముఖ్యమంత్రి, బిజెపి నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ అభివర్ణించారు. ఈ కూటమి విచ్ఛిన్నమైన రోజు మహారాష్ట్రలో బలమైన ప్రభుత్వాన్ని తాము ఏర్పాటు చేస్తామని ఆయన ప్రకటించారు. 
 
ఆ రోజు వచ్చే వరకు తమ పార్టీ బలమైన ప్రతిపక్షంగా నిజాయితీతో పనిచేస్తుందని చెప్పారు. రాష్ట్రంలో అధికార మార్పిడి కోసం తాము కాచుకుని కూర్చోలేదని ఆయన స్పష్టం చేశారు. ఇటువంటి ప్రభుత్వాలు (శివసేన, ఎన్‌సిపి, కాంగ్రెస్‌తో కూడిన ఎంవిఎ వంటి కూటమి) దేశంలో ఎక్కువ కాలం మనుగడ సాగించలేకపోయాయని గుర్తు చేశారు. 
 
ఈ ప్రభుత్వం కూడా అందుకు మినహాయింపు కాదని చెబుతూ బిజెపి నేతృత్వంలోని గత ప్రభుత్వ కాలంలో పేరుకుపోయిన విద్యుత్ బిల్లుల బకాయిలపై విచారణ జరపాలన్న మహారాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను ప్రస్తావిస్తూ విచారణ ప్రారంభమైన వెంటనే ప్రభుత్వం దానంతటదే పడిపోవడం ఖాయమని ఫడ్నవీస్ వెల్లడించారు. 
 
కాగా,  ‘ఇప్పుడు మ‌హారాష్ట్ర‌లో మ‌న ప్ర‌భత్వం లేద‌నే చింత వ‌ద్దు. మ‌రో రెండు మూడు నెల‌ల్లో మ‌నం ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌బోతున్నాం’ అని పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి బీజేపీ ఎంపీ రావ్‌సాహెబ్ పాటిల్ పేర్కొనడం గమనార్హం.