రూ 2 లకే దేశంలో సౌర విద్యుత్ 

చరిత్రలో ఎన్నడూ లేనంత కనిష్టానికి సౌర విద్యుత్‌ ధర పడిపోయింది. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఇసిఐ) సోమవారంనిర్వహించిన ఆక్షన్‌లో యూనిట్‌ సౌర విద్యుత్‌ ధరను కేవలం రెండు రూపాయలుగా ఒక సౌదీ అరేబియా సంస్థ కోట్‌ చేసిందని అధికార వర్గాలు తెలిపాయి. 

అల్జోమియా ఎనర్జీ అండ్‌ వాటర్‌ కంపెనీ 200 మెగావాట్లు, 400 మెగావాట్ల సామర్ధ్యం గల ప్లాంట్ల నుండి ఈ ధరకు విద్యుత్‌ సరఫరా చేస్తానని కోట్‌ చేసింది. సింగపూర్‌ కంపెనీ సెంబ్‌కార్ప్‌ అనుబంధ సంస్థయైన గ్రీన్‌ ఇన్‌ఫ్రా విండ్‌ ఎనర్జీతో కలసి ఈ కొటేషన్‌ వేసింది. 

అయితే కేంద్ర ప్రభుత్వరంగ సంస్థయైన ఎన్‌టిపిసి 600 మెగావాట్ల ప్లాంటు నుండి యూనిట్‌ రూ.2.01గా ధరను కోట్‌ చేసి, ఎల్‌2గా నిలిచింది. దీంతో సౌదీ అరేబియా సంస్థ టెండర్‌ పోనూ మిగిలివున్న 470 మెగావాట్లకు ఎన్‌టిపిసికి టెండర్‌ దక్కనున్నట్లు అధికార వర్గాల సమాచారం. 

గడచిన జూలైలో 2 గిగావాట్లకు ఎస్‌ఇసిఐ నిర్వహించిన టెండర్లలో సౌర విద్యుత్‌ యూనిట్‌ ధర రూ.2.36 కు పడిపోయిన విషయం విదితమే!