కరోనా వైరస్ కేసులతో తొలినాళ్లలో వణికిపోయిన మహారాష్ట్రలో వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం మళ్లీ కఠిన ఆంక్షలు విధిస్తోంది. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే విమాన, రైలు ప్రయాణికులకు కొవిడ్ నెగటివ్ సర్టిఫికెట్‌ను తప్పనిసరి చేసింది.
ఢిల్లీ-ఎన్‌సీఆర్, రాజస్థాన్, గుజరాత్, గోవా నుంచి వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా ఆర్‌టీ పీసీఆర్ కొవిడ్ నెగటివ్ టెస్టు రిపోర్టును కలిగి ఉండాలని సూచించింది. విమాన ప్రయాణికులైతే ల్యాండింగుకు 72 గంటల ముందు చేయించుకున్నదై ఉండాలని పేర్కొంది.
రైలు ప్రయాణికులైతే మహారాష్ట్రలో దిగడానికి 96 గంటల ముందు చేయించుకున్న పరీక్ష రిపోర్టు కలిగి ఉండాలని ప్రభుత్వం పేర్కొంది. మరొకొన్ని రాష్ట్రాలు కూడా ఈ విషయంలో మహారాష్ట్రను అనుసరించి అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇలా ఉండగా, పంట వ్యర్థాలు కాల్చడం వల్ల కోవిడ్-19 మరణాలు పెరిగాయని ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యదేవ్ జైన్ అన్నారు. పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను విరివిగా కాలుస్తుంటారు. ఇది ఢిల్లీలో కాలుష్య పెరుగుదలకు కారణం అవుతుంది.
అంతే కాకుండా కాలుష్యం కారణంగా కరోనా వైరస్ వ్యాప్తి కూడా ఎక్కువగా ఉంటుందని కొన్ని రిపోర్టులు తెలుపుతున్నాయి. దీంతో పంజాబ్, హర్యానా రాష్ట్రాల నుంచి వెలువడే కాలుష్యం వల్ల ఢిల్లీ నగరంలో కోవిడ్-19 కేసులు, మరణాలు పెరుగుతున్నాయనేది కేజ్రీవాల్ ప్రభుత్వ వాదన.
‘‘పంట వ్యర్థాలు కాల్చడం వల్ల కోవిడ్-19 పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. ఢిల్లీలో కోవిడ్ మరణాలు పెరిగేందుకు ఇది ప్రత్యక్షంగా ఊతమిస్తోంది. ఒక్క కోవిడ్-19 మాత్రమే కాకుండా అనేక ఇతర రోగాలకు ఇది కారణం అవుతోంది. ఒక వేళ పంట వ్యర్థాల్ని కాల్చడం ఇప్పుడు తగ్గించినా ఇప్పటి వరకు వెలువడ్డ కాలుష్యం ప్రభావం మరో రెండు మూడు వారాలు ఉంటుంది’’ అని ఆరోగ్యమంత్రి జైన్ పేర్కొన్నారు.
మరోవంక, దేశరాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తుండడంతో అక్కడి నుంచి రాకపోకలు సాగించే వారి విషయంలో పలు రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అలాగే ఆయా రాష్ట్రాల పరిపాలనాధికారులు ఢిల్లీ నుంచి వచ్చేవారిపై ఓ కన్నేసి ఉంచుతున్నారు.
యూపీలోని బరేలీ పరిపాలన అధికారులు కూడా ఢిల్లీ నుంచి వచ్చేవారి కోసం కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. ఢిల్లీకి సమీపంలో ఉన్న గాజియాబాద్-నోయిడా, హరియాణాకు చెందిన వేలాది మంది ప్రతీరోజూ ఢిల్లీకి రాకపోకలు సాగిస్తుంటారు. దీంతో వివిధ ప్రాంతాలలో కరోనా టెస్టుల నిర్వహణకు ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు.
బరేలీలోని ఫతేగంజ్‌లోని ఝుమ్కా చౌరస్తాలో మొబైల్ మెడికల్ యూనిట్ ఏర్పాటు చేశారు. కాన్పూర్, వారణాసి, ఆగ్రా రైల్వే స్టేషన్, బస్సు స్టేష్టన్‌లో ర్యాండమ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. ఉత్తరాఖండ్‌కు ఢిల్లీ నుంచి వచ్చేవారికి సరిహద్దులలో కరోనా టెస్టులు చేస్తున్నారు.
ఢిల్లీలో వరుసగా నాలుగవ రోజు కూడా కరోనా మృతుల సంఖ్య 100 దాటింది. గడచిన 24 గంటల్లో 121 మంది కరోనా బాధితులు మృత్యువాత పడ్డారు. దీంతో ఢిల్లీలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 8,512 దాటింది.
More Stories
ర్యాగింగ్పై కఠిన చర్యలు చేపట్టండి
క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్ లో ఐఐటీ ఢిల్లీ, ఐఐఎస్సీ బెంగళూరు
ఉచిత రేషన్ కార్డుల జారీపై`సుప్రీం’ అభ్యంతరం