కంగన రనౌత్‌కు అరెస్ట్ నుంచి మధ్యంతర రక్షణ

దేశద్రోహం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటి కంగన రనౌత్, ఆమె సోదరి రంగోలి చంచెల్‌లకు ఊరట లభించింది. ఈ కేసులో వారిని అరెస్ట్ చేయకుండా బాంబే హైకోర్టు మంగళవారం మధ్యంతర రక్షణ కల్పించింది.
 
అయితే, జనవరి 8న ముంబై పోలీసుల ఎదుట హాజరు కావాలని కోర్టు వారిని ఆదేశించింది. సామాజిక మాధ్యమాల్లో పోస్టుల ద్వారా మతపరమైన ఉద్రిక్తతలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలపై కంగన సిస్టర్స్‌పై కేసు నమోదైంది. 
 
అయితే, బాంద్రా మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశాల తర్వాత ఎఫ్ఐఆర్‌ను తిరిగి మార్చారు. అలాగే, రనౌత్, ఆమె సోదరిపై విచారణ జరపాలని కోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది.  తమపై నమోదైన ఎఫ్ఐఆర్‌తోపాటు, మేజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయాలని కోరుతూ కంగన, ఆమె సోదరి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
జస్టిస్ ఎస్ఎస్ షిండే, ఎంఎస్ కర్ణిక్‌లతో కూడి డివిజన్ బెంచ్ ఈ పిటిషన్‌ను విచారించింది. ఈ సందర్భంగా పోలీసులు పంపిన సమన్లను గౌరవించనందుకు కంగన సిస్టర్స్‌ను న్యాయస్థానం మందలించింది. అలాగే, కోర్టు ఆదేశాల ప్ర జనవరి 8న మధ్యాహ్నం 12-2 గంటల మధ్య ముంబై పోలీసుల ఎదుట కంగన సిస్టర్స్ హాజరవుతారని వారి తరపు న్యాయవాది రిజ్వాన్ సిద్దిఖి కోర్టుకు హామీ ఇచ్చారు. ఆ అభ్యర్థనను కోర్టు అంగీకరించింది. 
 
ఈ కేసు విచారణ సమయంలో కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో రాజద్రోహం ఆరోపణలు ఎందుకు చేశారని కోర్టు ప్రశ్నించింది. ‘దేశద్రోహ నేరం ఎందుకు? మన దేశ పౌరులను ఇలా ఎందుకు ట్రీట్ చేస్తున్నారు?’ అని జస్టిస్ షిండే అన్నారు. ఈ విషయంపై తదుపరి విచారణ సందర్భంగా సుదీర్ఘంగా పరిశీలిస్తామని పేర్కొంది. 
 
తర్వాత కేసు విచారణను జనవరి 11వ తేదీకి వాయిదా వేసింది.   ఈ విషయం సుదీర్ఘంగా వినే వరకు మధ్యంతర రక్షణ మంజూరు చేయాల్సిన అవసరం ఉందని తాము ప్రాథమికంగా అభిప్రాయపడినట్టు ధర్మాసనం పేర్కొంది. కాబట్టి పోలీసులు అరెస్ట్ సహా ఎటువంటి దుందుడుకు చర్యలకు పాల్పడవద్దని ఆదేశించింది.