అత్యధిక ట్విటర్‌ ఫాలోవర్లున్న కేంద్ర బ్యాంకుగా  ఆర్‌బీఐ  

ప్రపంచలోనే అత్యధిక ట్విటర్‌ ఫాలోవర్లు ఉన్న కేంద్ర బ్యాంకుగా రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) అవతరించింది. ఆర్‌బీఐ అధికారిక ట్విటర్‌ ఖాతా ‘RBI Twitter’ తాజాగా 10 లక్షల మంది ఫాలోవర్ల మార్కును సొంతం చేసుకుంది.

ప్రపంచవ్యాప్తంగా అత్యంత పేరెన్నికగన్నఅమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ 6.67 లక్షల ఫాలోవర్లతో రెండో స్థానంలో నిలువగా, యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంకు (ఈసీబీ) 5.91 లక్షల మంది ఫాలోవ‌ర్ల‌తో మూడో స్థానంలో ఉన్న‌ది. ఈ నేప‌థ్యంలో ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ సహోద్యోగులను అభినందిస్తూ ట్వీట్ చేశారు.

గత సెప్టెంబర్‌ 27 నాటికి 9.66 లక్షల ఫాలోవర్లు ఉన్న ఆర్‌బీఐ ట్విటర్‌ హ్యాండిల్‌ తాజాగా 10 లక్షల మైలురాయిని దాటింది. యూఎస్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ 2009 మార్చిలో ట్విటర్‌లో చేరగా ఈసీబీ 2009 అక్టోబర్‌లో చేరింది. అయితే గత 85 ఏండ్లుగా సేవలందిస్తున్న ఆర్‌బీఐ మాత్రం జనవరి 2012లో ట్విటర్‌ ఖాతా తెరిచింది. 

ప్రారంభంలో ఆర్‌బీఐ ట్విట్ట‌ర్‌ ఖాతాను అనుసరించేవారు కాస్త తక్కువగా ఉన్నప్పటికీ మార్చి 2019 నుంచి మార్చి 2020 మధ్య కాలంలో ఫాలోవర్ల సంఖ్య 3.42 లక్షల నుంచి 7.50 లక్షలకు చేరింది. కేవలం మార్చి 25 లాక్‌డౌన్‌ తర్వాత ఈ ఖాతాను అనుసరించే వారి సంఖ్య 1.5 లక్షలకు పైగా పెరిగింది. తాజా ఆర్థిక సంవత్సరంలోనే 2.50 లక్షల మంది కొత్తగా ఈ ఖాతాకు చందాదారులుగా చేరారు.