రూ 4,000 కోట్ల కుంభకోణంలో కర్ణాటక మాజీ మంత్రి అరెస్ట్ 

ఐ మాటరీ అడ్వైజరీ (ఐఎంఏ) కుంభకోణం కేసులో కర్నాటక మాజీ మంత్రి రోషన్‌ బేగ్‌ను సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (సీబీఐ) అధికారులు అరెస్టు చేశారు. ఆదివారం ఆయనను సీబీఐ విచారణకు పిలిచింది. ఈ కేసులో ప్రమేయంపై ఆయనను ప్రశ్నించారు. 

కుంభకోణంలో ఆయన కీలకపాత్ర పోషించారని, ఇందుకు ఆధారాలుండడంతో అరెస్టు చేశారు. అనంతరం ఆయనకు కొవిడ్‌ పరీక్షలు చేసి మేజిస్ట్రేట్‌ ముందు హాజరు పరిచారు. కోర్టు ఆయనకు 14 రోజుల జ్యుడీషియల్‌ విధించడంతో పరప్పన అగ్రహారాలోని బెంగళూరు సెంట్రల్‌ జైలుకు తరలించారు. 

ఈ కేసును సీబీఐకి అప్పగించే ముందు 2019 జూలైలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందం ఈ  కేసుకు సంబంధించి మొదటిసారి అనర్హతకు గురైన కాంగ్రెస్ ఎమ్యెల్యే  రోషన్‌ బేగ్‌ను ప్రశ్నించింది. ఐఎంఏ వ్యవస్థాపకుడు, మేనేజింగ్‌ డైరెక్టర్‌ అయిన మహ్మద్ మన్సూర్ ఖాన్ చేసిన ప్రకటన ఆధారంగా సీబీఐ విచారణ జరుపుతోంది. 

ఇస్లామిక్ పద్దతిలో పెట్టుబడులు పెట్టడం ద్వారా భారీ లాభాలు సమకూరుస్తామని భరోసాతో లక్షలాది మంది నుండి పెట్టుబడులు వసూలు చేసి మోసం చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సిట్‌ ఎదుట లొంగిపోక ముందే మన్సూర్‌ఖాన్‌, రోషన్‌ బేగ్‌ను నిందిస్తూ ఓ ఆడియోక్లిప్‌ను విడుదల చేశారు. అలాగే అప్పటి శివాజీనగర్‌ ఎమ్మెల్యేపై కూడా ఆరోపణలు చేయగా.. వాటిని ఇద్దరూ ఖండించారు.