యుపి,  పంజాబ్, హిమాచల్ ల్లో పెరుగుతున్న కరోనా 

కరోనా కేసులు ఉత్తరప్రదేశ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో అనూహ్యంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మూడు రాష్ట్రాల్లో కోవిడ్ పరిస్థితులను పరిశీలించేందుకు ప్రత్యేక బృందాలను పంపాలని కేంద్రం నిర్ణయించింది. కొత్త కేసులు ఎక్కువగా పెరుగుతుండడంతో కేంద్రం ఆయా చర్యలు చేపట్టింది. 

ఈ ప్రత్యేక బృందాలు కోవిడ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న జిల్లాలకు వెళ్లనున్నాయి. అక్కడ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు సహాయంగా నిలబడి మార్గదర్శనం చేస్తాయి. నియంత్రణ, నిఘా, పరీక్షలు వంటి అంశాలలో అండగా నిలబడతాయి. అదే విధంగా సమర్థవంతమైన చికిత్సావిధానాలు అందేలా చూస్తాయి. 

హర్యానా, రాజస్థాన్, గుజరాత్, మణిపూర్, చత్తీస గఢ్ రాష్ట్రాలకు కూడా కేంద్రం ఇలాగే ప్రత్యేక బృందాలను పంపింది.  కాగా, భారత్ లో కోలుకున్నవారి శాతం  మెరుగుపడి 93.69శాతానికి  చేరింది. జిటివ్‌ కేసుల సంఖ్య 91లక్షల మార్క్‌ను దాటింది.

26 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో చికిత్సపొందుతూ ఉన్నవారి సంఖ్య 20,000 లోపు ఉంది. 7 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఇంకా చికిత్సలోనే ఉన్నవారి సంఖ్య 20,000-50,000 మధ్య ఉండగా మహారాష్ట, కేరళ రాష్ట్రాలలో మాత్రమే ఈ సంఖ్య 50 వేలకు పైగా ఉంది.

తాజాగా గడిచిన 24గంటల్లో కొత్తగా 44,059 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్య సంక్షేమశాఖ తెలిపింది. మరో 511 మంది కరోనాకు బలి కాగా.. ఇప్పటి వరకు 1,33,738 మంది మృత్యువాతపడ్డారు. 24 గంటల్లో 41,024 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు.

ప్రస్తుతం దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 91,39,866కి చేరగా.. 4,43,486 యాక్టివ్‌ కేసులుండగా.. 85,62,642 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. దేశవ్యాప్తంగా ఆదివారం ఒకే రోజు 8,49,596 కొవిడ్‌ శాంపిల్స్‌ పరీక్షించినట్లు ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐఎంఆర్‌) తెలిపింది. ఇప్పటి వరకు 13,25,82,730 టెస్టులు చేసినట్లు వివరించింది.