ప్రైవేట్ రంగ బ్యాంకుల సంస్కరణలకు ఆర్బీఐ శ్రీకారం 

ప్రైవేట్‌ రంగ బ్యాంకుల్లో ప్రమోటర్ల వాటా పరిమితిని 26 శాతానికి పెంచాలని ఆర్బీఐ ఇంటర్నల్‌ వర్కింగ్‌ గ్రూప్‌ (ఐడబ్ల్యూజీ) ప్రతిపాదించింది. ప్రస్తుతం 15 శాతంగానే ఉండగా, రాబోయే 15 ఏండ్లలో మరో 11 శాతం పెంచుకునేలా మార్గదర్శకాలు జారీ చేయాలన్నది.
 
దేశంలోని ప్రైవేట్‌ రంగ బ్యాంకుల కార్పొరేట్‌ నిర్మాణం, యాజమాన్య మార్గదర్శకాల సమీక్షకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) ఈ ఏడాది జూన్‌ 12న ఐడబ్ల్యూజీని ఏర్పాటు చేయగా,  ఈ కమిటీ నివేదికను ఆర్బీఐ ఇప్పుడు విడుదల చేసింది. 
 
బ్యాంకింగ్‌ నియంత్రిత చట్టం 1949కి సవరణలు, అన్ని కోణాల్లో పరిశీలనల తర్వాతే బడా కార్పొరేట్లను బ్యాంకుల ప్రమోటర్లుగా అనుమతించాలని ఆర్బీఐకి కమిటీ సూచించింది. కాగా, జనవరి 15లోగా అభిప్రాయాలను తెలుపాలని ఆర్బీఐ పరిశ్రమను కోరింది.
 
భారీ బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్‌బీఎఫ్‌సీ)లు బ్యాంకులుగా మారేందుకూ కమిటీ అనుకూల సిఫార్సులు చేసింది. పదేండ్లుగా బ్యాంకింగేతర ఆర్థిక కార్యకలాపాలను నడిపిస్తున్న సంస్థలకే అవకాశం ఇవ్వాలని, అలాగే రూ.50వేల కోట్లు, ఆపై ఆస్తులున్న కంపెనీలకే బ్యాంకింగ్‌ లైసెన్స్‌ మంజూరు చేయాలని ఈ సందర్భంగా కమిటీ ఆర్బీఐకి సూచించింది. 
 
బ్యాంక్‌ లైసెన్స్‌ కోసం దరఖాస్తు పెట్టుకునే వ్యక్తులు/సంస్థల అర్హతలనూ సమీక్షించాల్సిన అవసరం ఉందని కమిటీ అభిప్రాయపడింది. బ్యాంకింగ్‌ కుంభకోణాలను అరికట్టేలా.. లైసెన్స్‌ వచ్చాక బ్యాంక్‌ కార్పొరేట్‌ నిర్మాణం, అందులో ప్రమోటర్లు, ఇతర వాటాదారుల దీర్ఘకాలిక పెట్టుబడుల నిబంధనలపై మరింత దృష్టి పెట్టాలన్నది.
 
కొత్త బ్యాంకుల లైసెన్స్‌కు సంబంధించి కనీస ప్రారంభ పెట్టుబడి మొత్తాన్ని రూ.500 కోట్ల నుంచి వెయ్యి కోట్ల రూపాయలకు పెంచాలని కమిటీ సిఫార్సు చేసినట్లు ఆర్బీఐ తెలియజేసింది. భారతీయ బ్యాంకులను ప్రపంచ స్థాయిలో ఉంచాలన్న లక్ష్యసాధనకు ఇది చాలా అవసరమని కమిటీ అభిప్రాయపడింది. అలాగే స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకుల లైసెన్స్‌ మొత్తాన్ని కూడా రూ.200 కోట్ల నుంచి 300 కోట్లకు పెంచాలన్నది.