త్వరలో బీజేపీలోకి మాజీ కేంద్ర మంత్రి సర్వే

కాంగ్రెస్  పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ హస్తానికి గుడ్‌బై చెప్పనున్నారు. మహేంద్రహిల్స్‌లోని సర్వే సత్యనారాయణ ఇంట్లో ఆయనను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ ఎంపీ వివేక్ కలిశారు. 
 
ఈ సందర్భంగా బీజేపీలోకి రావాలని సర్వే సత్యనారాయణను ఆహ్వానించారు. దీంతో వారి అభ్యర్థనను సర్వే సత్యనారాయణ స్వాగతించారు. త్వరలో బీజేపీలో చేరుతున్నట్లు సర్వే సత్యనారాయణ ఈ సందర్భంగా ప్రకటించారు. 
 
బీజేపీలో చేరమని బండి సంజయ్, వివేక్ కోరారని చెప్పారు. ప్రొటోకాల్ ప్రకారం బీజేపీలో చేరుతున్నట్లు వెల్లడించారు. పద్ధతి ప్రకారం నడుచుకుంటానని పేర్కొన్నారు. అంతేకాదు తనతో పాటు చాలా మందిని బీజేపీలో చేర్పిస్తానని సర్వే  స్పష్టం చేశారు.
 
ఇప్పటికే కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్‌పర్సన్ విజయశాంతి కమలం గూటికి చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. గ్రేటర్ ఎన్నికల ముగిసిన తర్వాత ఆమె ఢిల్లీ వెళ్లి బీజేపీ ఆగ్రనేతల సమక్షంలో కాషాయ కండువా కప్పుకోనున్నట్లు చెబుతున్నారు. విజయశాంతి ఇంటికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వెళ్లి చర్చలు జరిపిన విషయం తెలిసిందే.
 
గ్రేటర్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌కు ఇది పెద్ద ఎదురుదెబ్బగానే భావించొచ్చు. ఇప్పటికే దుబ్బాకలో ఓటమి పాలైంది. ఇంతలో గ్రేటర్ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో కాంగ్రెస్ సీనియర్లు.. పార్టీని వీడడం నష్టం చేకూర్చే అంశమే.
 
మరోవైపు కాంగ్రెస్‌ నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డితో శుక్రవారం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఇన్‌చార్జి భూపేంద్రయాదవ్‌ భేటీ అయ్యారు. ఆ పార్టీ మాజీ రాజ్యసభ సభ్యుడొకరితో కలిసి విశ్వేశ్వర్‌రెడ్డి వద్దకు వెళ్లినట్లు, సుమారు అరగంటపాటు వీరి మధ్య చర్చలు జరిగినట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి.