సోనియా ఆరోగ్యం ఆందోళనకరం… ఢిల్లీ నుండి తరలింపు 

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆరోగ్యం ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తున్నది. దేశ రాజధాని ఢిల్లీ నుంచి ప్రస్తుతానికి బయటికి వెళ్లాలని ఆమెకు వైద్యులు సూచించినట్లు తెలుస్తున్నది. 
 
ఢిల్లీలో నానాటికీ పెరిగిపోతున్న కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకుని వైద్యులు ఆమెకు ఈ సలహా ఇచ్చినట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. సోనియా గాంధీ కొంత కాలంగా ఛాతి ఇన్‌ఫెక్షన్‌తో బాధడుతున్నారు. జూలై 30 న ఆమె గంగారాం ఆస్పత్రిలో చేరారు. 
 
ఆ తర్వాత సెప్టెంబర్ మాసంలో సాధారణ వైద్య పరీక్షల నిమిత్తమై కొన్ని రోజుల పాటు ఆమె విదేశాలకు వెళ్లారు. ఆమెతో పాటు రాహుల్ గాంధీ కూడా విదేశాలకు వెళ్లడంతో సెప్టెంబర్ లో 10 రోజుల పాటు జరిగిన పార్లమెంట్ వర్షాకాల సమావేశంలో వారిద్దరూ పాల్గొనలేక పోయారు. 
 
అప్పటి నుంచి ఆమె వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నారు. ఢిల్లీలోని కాలుష్యం కారణంగా ఉబ్బసం వచ్చే అవకాశం ఉందని, అంతేకాకుండా ఛాతి నొప్పి కూడా తీవ్రతరం అయ్యే అవకాశాలున్నాయని, అందుకే ఇతర ప్రాంతానికి షిఫ్ట్ కావాలని సోనియాకు వైద్యులు సూచించారు. 
 
ఈ సూచనలతో సోనియా గోవా వెళ్తారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. సోనియాతో పాటు రాహుల్ లేదా ప్రియాంక కూడా వెళ్లనున్నట్లు తెలుస్తున్నది.సోనియా గాంధీ, ఆమె కుమారుడు, రాహుల్‌గాంధీ శుక్రవారం మధ్యాహ్నం గోవా రాజధాని పనాజీకి చేరుకున్నారు.  కొన్ని రోజులపాటు ఇక్కడే ఉంటారని తెలుస్తున్నది.