అశాంతికి మమతాయే నిధుల సమీకరణ 

పశ్చిమ బెంగాల్ లో చెలరేగుతున్న అశాంతికి స్వయంగా ముఖ్యమంత్రి మమతా బనెర్జీయే నిధులను సమీకరిస్తున్నారని కేంద్ర మంత్రి బబూల్ సుప్రియో తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని మండిపడ్డారు. 
 
గత మూడేళ్లలో 130 మంది బీజేపీ కార్యకర్తలు హత్యకు గురయ్యారని, రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని ధ్వజమెత్తారు.  బెంగాల్ ప్రజలు నూటికి నూరు శాతం బీజేపీ వెంటే ఉన్నారని స్పష్టం చేశారు. 
 
పోలీసులను, రాజకీయ వ్యవస్థను పూర్తిగా దుర్వినియోగం చేయడం వల్లే మమత ఇంకా అధికారంలో కొనసాగుతున్నారని ఆయన విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ 200 సీట్లతో బంపర్ విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 
 
‘‘బీజేపీ గెలిస్తే బెంగాల్‌కు ఏది అవసరమో అదే చేస్తాం. మమతకు రాజ్యాంగం మీద విశ్వాసం లేదు. వాతావరణం మాకే అనుకూలంగా ఉంది. మేమే బెంగాల్‌లో జెండా పాతుతాం.’’ అని బబూల్ సుప్రియో భరోసా వ్యక్తం చేశారు.