భ‌ద్ర‌తా ద‌ళాల‌ను మెచ్చుకున్న ప్రధాని మోదీ

జ‌మ్మూక‌శ్మీర్‌లోని న‌గ్రోటాలో గురువారం భీక‌ర ఎన్‌కౌంట‌ర్ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఆ ఎదురుకాల్పుల్లో జైషే ఉగ్ర‌వాదులు న‌లుగురు హ‌తం అయ్యారు.  ఈ ఘ‌ట‌న‌పై ఇవాళ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఉన్న‌త స్థాయి స‌మావేశం నిర్వ‌హించారు.  

ఆ భేటీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఇత‌ర ఇంటెలిజెన్స్ అధికారులు పాల్గొన్నారు.  ముంబై లో 2008లో జ‌రిగిన సెప్టెంబ‌ర్ దాడుల‌కు గుర్తుగా ఉగ్ర‌వాదులు మ‌రో భారీ దాడికి ప‌న్నాగం వేసిన‌ట్లు ప్ర‌భుత్వ వ‌ర్గాలు గుర్తించాయి. 

అమిత్ షా, అజిత్ దోవ‌ల్‌, విదేశాంగ కార్య‌ద‌ర్శితో పాటు ఇత‌ర అధికారుల‌తో న‌గ్రోటా ఎదురుకాల్పుల‌పై మోదీ హై లెవ‌ల్ స‌మావేశం నిర్వ‌హించారు.  ముంబై దాడులు జ‌రిగి 12 ఏళ్లు అవుతున్న త‌రుణంలో ఉగ్ర‌వాదులు మ‌ళ్లీ దాడులకు పధకం చేసిన‌ట్లు ప్ర‌భుత్వ వ‌ర్గాలు వెల్ల‌డిస్తున్నాయి.

మ‌న భ‌ద్ర‌తా ద‌ళాలు మ‌రోసారి అత్యంత సాహాసాన్ని, పోటీత‌త్వాన్ని ప్ర‌ద‌ర్శించాయ‌ని ప్ర‌ధాని కొనియాడారు. అప్రమత్తంగా ఉన్న సైనిక ద‌ళాల‌కు మోదీ ధన్యవాదాలు తెలిపారు.  జ‌మ్మూక‌శ్మీర్‌లో జ‌రుగుతున్న స్థానిక ప్ర‌జాస్వామ్య ప్ర‌క్రియ‌ను అడ్డుకునేందుకు ప్ర‌య‌త్నించిన ఉగ్ర‌వాదుల‌ను సైనిక ద‌ళాలు నిలువ‌రించిన‌ట్లు ప్ర‌ధాని మోదీ ప్రశంసించారు.  

పాకిస్థాన్‌లోని జైషే మ‌హ‌మ్మ‌ద్ ఉగ్ర‌వాద సంస్థ‌కు చెందిన న‌లుగురు ఉగ్ర‌వాదుల‌ను మ‌న‌వాళ్లు మ‌ట్టుబెట్టార‌ని, ఉగ్ర‌వాదుల నుంచి భారీ స్థాయిలో ఆయుధాలు, పేలుడు ప‌దార్ధాల‌ను స్వాధీనం చేసుకున్నామ‌ని, దీంతో భారీ విధ్వంసాన్ని త‌ప్పించార‌ని ఆయ‌న పేర్కొన్నారు. 

జమ్మూ జోన్ పోలీసు ఇన్‌స్పెక్టర్ జనరల్ ముఖేశ్ సింగ్ మాట్లాడుతూ, ఉగ్రవాదులు భారీ దాడికి కుట్ర పన్నుతూ ఉండవచ్చునని, జమ్మూ-కశ్మీరు కేంద్ర పాలిత ప్రాంతంలో జిల్లా అభివృద్ధి మండళ్ళ ఎన్నికలను భగ్నం చేసేందుకు ప్రయత్నిస్తూ ఉండవచ్చునని తెలిపారు. ఈ ఎన్నికలు ఈ నెల 28 నుంచి డిసెంబరు 19 వరకు 8 దశల్లో జరుగుతాయి. డిసెంబరు 22న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

2008 నవంబరు 26న ముంబైలో జరిగిన ఉగ్రవాద దాడుల్లో 10 మంది ఉగ్రవాదులు పాల్గొన్నారు. వీరు వేర్వేరు ప్రాంతాల్లో  విచక్షణారహితంగా కాల్పులు, బాంబు దాడులకు పాల్పడ్డారు. దీంతో 166 మంది ప్రాణాలు కోల్పోగా, సుమారు 300 మంది తీవ్రంగా గాయపడ్డారు.