సదానంద గౌడ, ఎకె ఆంటోనీలకు కరోనా 

దేశంలో అనేకమంది ప్రజాప్రతినిధులు, సినీతారలు కరోనా బారిన పడుతున్న విషయం విధితమే. తాజాగా మరో కేంద్రమంత్రి డీవీ సదానంద గౌడకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ట్విటర్‌లో ఆయనే గురువారం వెల్లడించారు. 
 
వైరస్‌కు సంబంధించిన లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకున్నానని, రిపోర్టు పాజిటివ్‌గా వచ్చినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన స్వీయనిర్బంధంలోకి వెళ్లినట్లు చెప్పారు. ఇటీవల తనను కలసినవారంతా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
 
అలాగే, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు, కేంద్ర మాజీ మంత్రి ఏకే ఆంటోనీ, ఆయన సతీమణి కూడా కరోనా బారిన పడ్డారు. ఆంటోనీ తనయుడు కె.అనిల్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం దంపతులిద్దరూ దిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారని, వీరి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలిపారు.  
 
కాగా, ఢిల్లీలో కరనా విలయ తాండవం చేస్తోంది. పాజిటివ్‌ కేసులు 5 లక్షల మార్కును దాటా యి. బుధవారం ఒక్కరోజే 131 మరణాలు సంభవించాయి. దేశం లో నమోదైన మొత్తం మరణాల్లో ఢిల్లీ వాటా 22.39ు. కొత్త పాజిటివ్‌ కేసుల సంఖ్య 7,486గా నమోదైంది. 18 రోజులుగా కేసు లు, మరణాలు పెరుగుతుండడంపై ఢిల్లీ హైకోర్టు కేజ్రీవాల్‌ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
 
 సీనియర్‌ న్యాయవాది రాకేశ్‌ మల్హోత్రా దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణ జరుపుతూ ‘‘ముందే ఎందుకు మేల్కొన లేదు? 18 రోజుల్లో తమ వారిని కోల్పోయిన కుటుంబాలకు మీరేం సమాధానం చెబుతారు? కోర్టు జోక్యం చేసుకునే దాకా ఎందుకు చర్యలు ప్రారంభించలేదు?’’ అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. 
 
‘‘కరోనా కేసుల్లో న్యూయార్క్‌, సావోపాలో లాంటి నగరాలను ఢిల్లీ దాటేసింది. పరిస్థితిని భూతద్దంలో చూడండి’’అని హితవు పలికింది. కోర్టు మొట్టికాయలతో కేజ్రీవాల్‌ సర్కారు వెంటనే స్పందించింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించని జరిమానాను రూ.500 నుంచి రూ.2 వేలకు పెంచింది.
 
మరో మూడు నెలల్లో కొవిడ్‌ వ్యాక్సిన్‌ అందుబాటులోకి రానుందని కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌ ప్రకటించారు.  ‘‘వ్యాక్సిన్‌ పంపిణీలో వైద్య సిబ్బందికి, 65 ఏళ్లు దాటిన వృద్ధులకు ప్రాథాన్యతనిస్తాం. వచ్చే ఏడాది జూలై-ఆగస్టు కల్లా 50 కోట్ల డోసుల వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తుంది. దాన్ని సుమారు 30 కోట్ల మందికి పంపిణీ చేయవచ్చు’’ అని వివరించారు.  
 
దేశంలో క‌రోనా కేసులు 90 ల‌క్ష‌లు దాటాయి. నెల రోజులుగా త‌గ్గుతూవ‌స్తున్న క‌రోనా కేసులు వ‌రుస‌గా రెండో రోజూ పెరిగాయి. అదేవిధంగా చాలా రోజుల త‌ర్వాత యాక్టివ్ కేసుల్లో పెరుగుద‌ల న‌‌మోద‌య్యింది. భారత్‌లో గడచిన 24 గంటల్లో కరోనా బారిన పడిన వారిలో 584 మంది మృతి చెందినట్లు కేంద్రం వెల్లడించింది. భారత్‌లో ఇప్పటివరకూ కరోనా బారిన పడి 1,32,162 మంది మృతి చెందినట్లు తెలిపింది.