కుణాల్ కమ్రా ట్వీట్లపై ట్విటర్ కు మరో చిక్కు 

భారత చిత్రపటాన్ని తప్పుగా చూపిన ట్వీట్ కు భారత్ కు క్షమాపణ చెప్పుకోవలసిన ట్విట్టర్ తాజాగా మరో వివాదంలో చిక్కుకొంది. స్టాండప్ కమెడియన్ కుణాల్ కమ్రా అసభ్యకర ట్వీట్లపై ట్విటర్ ప్రతినిథులను పార్లమెంటరీ కమిటీ గురువారం ప్రశ్నించింది. 
 
సుప్రీంకోర్టుపైనా, భారత ప్రధాన న్యాయమూర్తిపైనా కుణాల్ కమ్రా ఆమోదయోగ్యం కాని ట్వీట్లు చేసిన నేపథ్యంలో ట్విటర్ ప్రతినిథులను ఈ కమిటీ ప్రశ్నించింది. 7 రోజుల్లోగా సమాధానం చెప్పాలని ట్విటర్‌ను ఆదేశించింది. 

బీజేపీ నేత మీనాక్షి లేఖి నేతృత్వంలోని పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లుపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ సమక్షంలో ట్విటర్ ప్రతినిథులు హాజరయ్యారు. ట్విటర్ ప్రతినిథులను మీనాక్షి లేఖితోపాటు ఈ కమిటీ సభ్యుడు, కాంగ్రెస్ నేత వివేక్ తన్‌ఖా ప్రశ్నించారు. 

రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామికి సుప్రీంకోర్టు బెయిలు మంజూరు చేయడంతో కుణాల్ కమ్రా అసభ్యకరమైన ట్వీట్లను చేసిన సంగతి తెలిసిందే. కుణాల్ కమ్రాపై క్రిమినల్ కోర్టు ధిక్కార కేసులు దాఖలు చేసేందుకు అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ సమ్మతించారు. 

అయితే తాను తన ట్వీట్ల విషయంలో వెనుకకు తగ్గేది లేదని, క్షమాపణ చెప్పబోనని కుణాల్ పేర్కొన్నారు. మీనాక్షి లేఖి విలేకర్లతో మాట్లాడుతూ, ట్విటర్ తన వేదికపై అసభ్యకర వ్యాఖ్యలకు అవకాశం ఇవ్వడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు.

సుప్రీంకోర్టుపైనా, భారత ప్రధాన న్యాయమూర్తిపైనా స్టాండప్ కమెడియన్ కుణాల్ కమ్రా చేసిన వ్యాఖ్యల వంటి అసభ్యకరమైన వ్యాఖ్యలకు ట్విటర్ అవకాశం ఇవ్వడం శోచనీయమని పేర్కొన్నారు. అత్యున్నత రాజ్యాంగ వ్యవస్థలను దూషించేందుకు తన వేదికను దుర్వినియోగపరచడానికి ట్విటర్ అవకాశం ఇస్తోందని విమర్శించారు.

పార్లమెంటరీ ప్యానెల్‌లోని వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలు ట్విటర్ ప్రతినిథులను ప్రశ్నించారన్నారు. కాంగ్రెస్ ఎంపీ వివేక్ తన్‌ఖా, బీఎస్‌పీ ఎంపీ రితేష్ పాండే, బీజేడీ ఎంపీ భతృహరి మహతాబ్ ట్విటర్ ప్రతినిథులను ప్రశ్నించినట్లు తెలిపారు. హ్యాండిల్స్, ట్వీట్లను నిషేధించినట్లు ట్విటర్ ఇచ్చిన వివరణ సరిపోదని తెలిపారు.

ఇదిలావుండగా, ట్విటర్ ఇటీవలే భారత దేశానికి లిఖితపూర్వకంగా క్షమాపణ చెప్పిన సంగతి తెలిసిందే. భారత దేశానికి చెందిన లేహ్, లడఖ్‌ను చైనాలో భాగంగా ట్విటర్ జియోట్యాగింగ్ ఫీచర్ చూపించడాన్ని భారత దేశం తీవ్రంగా తప్పుబట్టింది. 

దీంతో ట్విటర్ చీఫ్ ప్రైవసీ ఆఫీసర్ డామియెన్ కియెరాన్ సంతకంతో అఫిడవిట్ ద్వారా క్షమాపణ తెలిపారు.నవంబరు 30నాటికి ఈ తప్పును సరిదిద్దుతామని భారత దేశానికి ట్విటర్ తెలిపింది.