పార్టీ ఫిరాయింపులు అనైతికం, అప్రజాస్వామికం

ఎన్నికైన  ప్రజా ప్రతినిథులు తాము ఎన్నికైన పార్టీ నుంచి వేరొక పార్టీకి మారడం, అవిధేయత చూపడం తిరోగమన చర్య మాత్రమే కాకుండా ప్రజాస్వామిక పాలన భావనకు అతీతమని, అంతేకాకుండా అనైతికం, సిద్ధాంతరాహిత్యమని కేరళ హైకోర్టు మండిపడింది. 

చట్టబద్ధమైన సంస్థకు ఎన్నికైన రాజకీయ పార్టీ అభ్యర్థి ఎల్లప్పుడూ దృష్టిలో ఉంచుకోవలసిన అంశాలను వివరించింది. తన రాజకీయ కార్యకలాపాలను, అదేవిధంగా సంస్థలో తాను నిర్వహించే విధులను తన పార్టీ శాసనాలు కూడా నియంత్రిస్తాయని, మార్గదర్శనం చేస్తాయని గుర్తుంచుకోవాలని పేర్కొంది. 

తాను ఆ సంస్థ సభ్యునిగా కొనసాగడం తన పార్టీ పట్ల నిస్సంకోచమైన, దృఢమైన విధేయతను చూపడంపై ఆధారపడుతుందని తెలుసుకోవాలని తెలిపింది. తిరువళ్ల మునిసిపాలిటీ చైర్మన్ కేవీ వర్గీస్ దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చుతూ హైకోర్టు డివిజన్ బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసింది.

ఎన్నికల కమిషన్ తనపై అనర్హత వేటు వేయడాన్ని, స్థానిక సంస్థలకు ఆరు సంవత్సరాలపాటు పోటీ చేయకుండా తనపై నిషేధం విధించడాన్ని వర్గీస్ తన పిటిషన్‌లో సవాలు చేశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలను సింగిల్ జడ్జి బెంచ్ సమర్థించింది.

వర్గీస్ కాంగ్రెస్ అభ్యర్థిగా మునిసిపల్ కౌన్సిల్‌కు ఎన్నికైన తర్వాత చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. మునిసిపల్ కౌన్సిల్ చైర్మన్ పదవికి రాజీనామా చేయాలని వర్గీస్‌ను కాంగ్రెస్ జిల్లా ప్రెసిడెంట్ ఆదేశించారు. కానీ వర్గీస్ తన పదవికి రాజీనామా చేయడానికి తిరస్కరించారు. 

ఆయన ప్రవర్తన పార్టీ నాయకత్వం ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించడమేనని ఎన్నికల కమిషన్ పేర్కొంది. తిరువళ్ల మునిసిపాలిటీ కౌన్సిలర్‌గా తనను ఎన్నుకున్న పార్టీకి వర్గీస్ అవిధేయంగా మారారని పేర్కొంది. 

ఈ మునిసిపాలిటీ చైర్మన్ పదవికి రాజీనామా చేయాలని పార్టీ ఆదేశించినప్పటికీ, ఆ విధంగా రాజీనామా చేయడానికి తిరస్కరించడం తన పార్టీ పట్ల అవిధేయంగా వ్యవహరించడమేనని స్పష్టం చేసింది. 

ఎన్నికలు ప్రజాస్వామ్యంలో చాలా ముఖ్యమైనవని హైకోర్టు తెలిపింది. ఎన్నికైన అభ్యర్థులంతా తమ తమ రాజకీయ పక్షాలకు విధేయంగా ఉంటూ, వాటి అభిప్రాయాలను స్వీకరించడానికి కట్టుబడి ఉండాలని, ఎన్నికలకు ముందు ఏర్పాటైన కూటమి బలపడటానికి నిజమైన స్ఫూర్తితో వ్యవహరించాలని తెలిపింది. 

అధికారంలో ఉన్నవారి కార్యకలాపాలను సమతుల్యం చేయవలసిన అవసరం ఉందని తెలిపింది. రాజ్యాంగ విలువలను కచ్చితంగా పాటిస్తూ, తమ పరిపాలన ప్రజారంజకంగా ఉండే విధంగా చూసుకోవాలని తెలిపింది.