పశ్చిమ బెంగాల్ లో మరో ఆరునెలల్లో బిజెపి ప్రభుత్వం ఏర్పాటు కానున్నట్లు రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు దిలీప్ ఘోష్ ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది ప్రారంభంలో జరిగే ఎన్నికలలో 200 సీట్లు గెలుచుకొంటామని భరోసా వ్యక్తం చేశారు.
ఈ ఎన్నికల్లో గెలుపు కోసం ‘మిషన్ బెంగాల్’ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మూడు, నాలుగేళ్ళ నుంచి బీజేపీ పశ్చిమ బెంగాల్‌లో గెలుపు కోసం గట్టిగా కృషి చేస్తోందని ఆయన చెప్పారు. ఈ కృషికి ఫలితాలు మొదట పంచాయతీ ఎన్నికల్లోనూ, ఆ తర్వాత లోక్‌సభ ఎన్నికల్లోనూ కనిపించాయని గుర్తు చేశారు.
తమ పార్టీ కేంద్ర నాయకత్వం క్షేత్ర స్థాయిలో పరిస్థితులను అంచనా వేస్తోందని, ఎక్కడ రాణించగలదో చెప్తోందని చెప్పారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా వంటి సీనియర్ నేతలు బెంగాల్‌లో పర్యటించినట్లు తెలిపారు.
రాష్ట్రంలో ఆర్థిక, సాంఘిక నేరాలకు కారణం టీఎంసీయేనని ఘోష్ ధ్వజమెత్తారు. బొగ్గు మాఫియా, ఆవుల స్మగ్లింగ్‌లపై కేంద్ర సంస్థలు చర్యలు తీసుకుంటే, వాళ్ళు (టీఎంసీ) ఎందుకు బాధపడుతున్నారని ప్రశ్నించారు. వాళ్ల నేతలను తాము పట్టుకోలేదని, అయితే అది భవిష్యత్తులో జరగవచ్చునని స్పష్టం చేశారు. లేకపోతే, ఇదంతా ఇంత కాలం నుంచి ఎలా జరుగుతోందని ప్రశ్నించారు.
పశ్చిమ బెంగాల్‌లో 294 శాసన సభ స్థానాలు ఉన్నాయి. ప్రస్తుతం మమత బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ అధికారంలో ఉంది. ప్రస్తుతం టీఎంసీకి 222 మంది ఎమ్మెల్యేలు, బీజేపీకి 16 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.
More Stories
కంగనా విచారణకు హాజరు కావాలని చండీగఢ్ కోర్టు నోటీసు
పదేళ్ల తర్వాత నేడే జమ్మూ కాశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికలు
గణేష్ పూజను కూడా ఓర్వలేకపోతున్న కాంగ్రెస్