మహారాష్ట్ర మాట్లాడే ప్రజలు కన్నడిగులు వంటి వారే  

‘రాష్ట్రంలోని మహారాష్ట్ర మాట్లాడే ప్రజలు అందరు కన్నడిగులు వంటి వారే. వారూ మా వాళ్లే. వారి అభివృద్ధి కోసం మరాఠా డవలప్‌మెంట్ అథారిటీని ఏర్పాటు చేశాం’ అని  కర్ణాటక ముఖ్యమంత్రి బిఎస్ యడియూరప్ప తెలిపారు.
 
 ‘సామాన్య ప్రజానీకం హక్కుల కోసం బాలాసాహెబ్ తన జీవితాంతం పోరాటం చేశారు. మహారాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి, బెల్గాం, కార్వార్, నిపాని సహా ఐక్య మహారాష్ట్ర ఏర్పాటుకు ఆయన కలగనే వారు. ఆయన కలలను సాకారం చేసేందుకు మనం సంకల్పిద్దాం’ అని  మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ చేసిన ప్రకటనను ఆయన కొట్టిపారవేసారు. 
 
అజిత్‌ పవార్‌ వ్యాఖ్యలు వివాదాలకు ఆజ్యం పోసేలా ఉన్నాయని చెబుతూ ఇలాంటి వ్యాఖ్యలను మరోసారి చేయొద్దంటూ యడియూరప్ప హెచ్చరించారు. ఈ విషయంలో మహాజన్‌ కమిటీ నివేదికే తుది నివేదిక అని స్పష్టం చేశారు. 
 
మరాఠాలు బలమైన హిందుత్వ వాదులని చెబుతూ త్వరలో బెల్గాంలో నిర్వహించే విశ్వ కన్నడ సమ్మేళనంలో వారు కూడా పాల్గొంటారని తెలిపారు. 
 
 కర్ణాటకలో ఉన్న బెల్గాం, ఇతర ప్రాంతాలు ముంబై ప్రెసిడెన్సీలో భాగమైనందున అవి తమవేనని మహారాష్ట్ర వాదిస్తోంది. సరిహద్దు వివాదానికి సంబంధించిన లీగల్ కేసులను పరిశీలించేందుకు ఛగన్ భుజ్‌బల్, ఏక్‌నాథ్ షిండేలను మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే నియమంచారు.