ఎన్నికల కమీషన్ ఆత్మవిశ్వాసం బలపరచిన బీహార్ 

కోవిడ్-19 మహమ్మారి సమయంలో బిహార్ శాసన సభ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించడంతో ఆత్మవిశ్వాసం బలపడిందని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరా చెప్పారు. అన్ని వైపుల నుంచి వస్తున్న ప్రశంసలతో వచ్చే ఏడాది నిర్వహించవలసిన శాసన సభ ఎన్నికలను కూడా సకాలంలో నిర్వహించగలమనే భరోసా ఏర్పడిందని పేర్కొన్నారు.

పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సాం, పుదుచ్చేరి శాసన సభలకు వచ్చే మే-జూన్ నెలల్లో ఎన్నికలు నిర్వహించేందుకు అంతర్గత కసరత్తు జరుగుతోందని తెలిపారు. కోవిడ్ మహమ్మారి సమయంలో ఎన్నికల కమిషన్ దుస్సాహసం చేస్తోందని తాము భావించే విధంగా కొందరు మాట్లాడారని గుర్తు చేశారు.

అయితే కమిషన్‌లో ప్రతి ఒక్కరికీ ఇది నమ్మకంతో వేసిన అడుగు అని, చీకట్లో దూకడం కాదని స్పష్టం చేశారు. ఆత్మవిశ్వాసంతో వేసిన అడుగు’ అనే మాటలను ఎప్పుడైతే ఉపయోగించామో, ఆ మాటలు నాటకీయంగా మాట్లాడేవి కాదని చెప్పారు.

దీని వెనుక చాలా ప్రయత్నాలు ఉంటాయని చెబుతూ ఏ ఎన్నికల్లోనైనా తాము చాలా శ్రమించి పని చేస్తామని చెప్పారు. అయితే కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ మరింత భగీరథ ప్రయత్నం అయిందని చెప్పారు.

ఎన్నికలు నిర్వహించాలన్న నిర్ణయాన్ని ప్రశ్నించినవారి అభిప్రాయం తప్పు అని నిరూపించారా? అని అడిగినపుడు సునీల్ అరోరా స్పందిస్తూ, తాను ఆ విధంగా మాట్లాడటం అమర్యాదకరం అవుతుందని పేర్కొన్నారు. 

మీడియా, ప్రజలు, ఓటర్లు, సంబంధితులు ఆ విషయం గురించి చెప్పాలని సూచించారు. ఎన్నికల కమిషన్ ఎటువంటి సవాలునైనా ఎదుర్కొనగలదని పేర్కొంటూ కోవిడ్-19 మహమ్మారి సవాలుకు దీటుగా నిలిచిందని చెప్పారు.