క్షమించమని భారత్ ను కోరిన ట్విట్టర్

సామాజిక మాధ్యమం ట్విటర్ భారత దేశానికి లిఖితపూర్వకంగా క్షమాపణ చెప్పింది. లడఖ్‌ను తప్పుగా చైనాలో భాగంగా చూపినందుకు క్షమాపణ కోరింది, ఈ తప్పును ఈ నెలాఖరుకు సరిదిద్దుతామని చెప్పింది. ఈ మేరకు మీనాక్షి లేఖి నేతృత్వంలోని పార్లమెంటరీ ప్యానెల్‌కు అఫిడవిట్ సమర్పించింది.

భారత దేశపు మ్యాప్‌ను తప్పుగా జియోట్యాగింగ్ చేసినందుకు ట్విటర్ క్షమాపణ చెప్పిందని మీనాక్షి లేఖి తెలిపారు. ట్విటర్ వాజ్మూలాన్ని అఫిడవిట్ రూపంలో సమర్పించినట్లు ఆమె చెప్పారు. ఈ అఫిడవిట్‌పై ట్విటర్ ఇంక్ చీఫ్ ప్రైవసీ అధికారి డామియెన్ కరియెన్ సంతకం చేసినట్లు చెప్పారు. 

లడఖ్‌ను చైనాలో భాగంగా చూపినందుకు అఫిడవిట్ ద్వారా లిఖితపూర్వకంగా క్షమాపణ చెప్పినట్లు తెలిపారు. భారతీయుల మనోభావాలను గాయపరచినందుకు క్షమాపణ చెప్పారని, 2020 నవంబరు 30నాటికి ఈ తప్పును సరిదిద్దుతామని ప్రమాణం చేశారని తెలిపారు. 

భారత దేశానికి చెందిన లడఖ్‌ను ట్విటర్ జియోట్యాగింగ్‌ ఫీచర్‌ చైనాలో భాగంగా చూపింది. దీనిపై డేటా ప్రొటెక్షన్ బిల్లుపై పార్లమెంటు సంయుక్త కమిటీ తీవ్రంగా మండిపడింది. ట్విటర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది దేశ ద్రోహ చర్యగా పరిగణించదగినదని తెలిపింది. 

దీనిపై అఫిడవిట్ రూపంలో వివరణ ఇవ్వాలని భారత్ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో మీనాక్షి లేఖి సారథ్యంలోని పార్లమెంటరీ కమిటీ సమక్షంలో ట్విటర్ ఇండియా ప్రతినిథులు  హాజరయ్యారు. పొరపాటు జరిగిందని క్షమాపణ చెప్పారు. కానీ కమిటీ సభ్యులు ఈ క్షమాపణను అంగీకరించలేదు.

ఇది క్రిమినల్ నేరమని, దేశ సార్వభౌమత్వాన్ని ప్రశ్నించడమని, అందువల్ల ట్విటర్ ఇంక్ తప్పనిసరిగా అఫిడవిట్ రూపంలో క్షమాపణ చెప్పాలని స్పష్టం చేశారు. క్షమాపణ చెప్పవలసినది ట్విటర్ మార్కెటింగ్ విభాగం కాదని వివరించారు.

అక్టోబరు 22న భారత ప్రభుత్వం కూడా దీనిపై ఘాటుగా స్పందించింది. లేహ్‌ను చైనాలో భాగంగా చూపడాన్ని తప్పుబట్టింది. దేశ సార్వభౌమత్వం, అఖండతలను అగౌరవపరచడమేనని తెలిపింది. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది.