ఆవుల సంరక్షణ కోసం ఎంపీలో గౌ కేబినెట్   

ఆవుల సంరక్షణ కోసం ఎంపీలో గౌ కేబినెట్   

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఆవుల సంరక్షణ కోసం ప్రత్యేకంగా గౌ కేబినెట్ ను ఏర్పాటు చేశామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు. గౌ కేబినెట్ ఈ వారంలో సమావేశం అయి, గోవుల సంరక్షణ కోసం చర్యలు తీసుకుంటుందని సీఎం చెప్పారు.

ఈ గౌ కేబినెట్ లో పశుసంవర్ధకశాఖ, అటవీ, పంచాయతీ, గ్రామీణాభివృద్ధి, రెవెన్యూ, గృహ, రైతు సంక్షేమ శాఖలను చేర్చామని సీఎం హిందీలో ట్వీట్ చేశారు. గౌ కేబినెట్ మొట్టమొదటి సమావేశం ఈ నెల 22వతేదీన గోపాష్టమిలోని ఆవుల అభయారణ్యంలో నిర్వహిస్తామని సీఎం వివరించారు. 

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 1,80,000 గోవుల సంరక్షణ కోసం ప్రభుత్వం రోజుకు రూ  11 కోట్లను కేటాయించిందని సీఎం చెప్పారు.   బీజేపీ నేతృత్వంలోని బీజేపీ సర్కారు 2017లో దేశంలోనే తొలిసారి ఆవుల అభయారణ్యాన్ని ప్రారంభించింది.

భోపాల్ నగరానికి 190 కిలోమీటర్ల దూరంలో అగర్ మాల్వాలో రూ.32 కోట్లతో 472 హెక్టార్లలో గోవుల అభయారణ్యం ఏర్పాటు చేశారు. 2020-21 సంవత్సరం బడ్జెట్ లో ఆవుల సంరక్షణకు రూ 112 కోట్లను కేటాయించారు. ఆవుల రక్షణ కోసం విరాళాలు ఆహ్వానించగా అంతగా రాలేదు. ఒక ఆవును మేపడానికి ఏడాదికి 600 రూపాయలు ఖర్చుఅవుతోందని ఓ అధికారి చెప్పారు.