క్షేత్ర స్థాయిలో పట్టుకోల్పోతున్న కాంగ్రెస్ 

క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పట్టు కోల్పోతున్నదనిఆ పార్టీ మరో సీనియర్ నాయకుడు పి చిదంబరం ఆందోళన వ్యక్తం చేశారు. బీహార్ అసెంబ్లీ‌తో పాటు గుజ‌రాత్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, యూపీ, క‌ర్నాట‌క రాష్ట్రాల్లో జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ ఘోర ప‌రాభ‌వం చ‌విచూసింది. 

ఈ ఫ‌లితాల‌ను ప‌రిశీలిస్తే,  క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఆన‌వాళ్లు లేనట్లుగా క‌నిపిస్తోందని చిదంబరం పేర్కొ‌న్నారు.  లేదంటే ఆయా ప్రాంతాల్లో కాంగ్రెస్ బ‌ల‌హీన ప‌డి ఉంటుందని తెలిపారు. కాంగ్రెస్ పేలవ ప్ర‌ద‌ర్శ‌న‌పై నిన్నే మ‌రో సీనియ‌ర్ నేత క‌పిల్ సిబ‌ల్ త‌న అస‌హ‌నం వ్య‌క్తం చేసిన విష‌యం తెలిసిందే.  

ఆర్జేడీ-కాంగ్రెస్ కూట‌మిగా బీహార్‌లో గెలిచే ఛాన్సు ఉంది, కానీ విజ‌యానికి ద‌గ్గ‌ర‌గా వ‌చ్చి ఓడిపోయామ‌ని, దీనిపై స‌మ‌గ్ర ప‌రిశీలిన చేయాల‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు.

 వ్య‌వ‌స్థీకృతంగా బ‌లంగా ఉంటే చిన్న పార్టీలు కూడా మంచి విజ‌యాన్ని సొంతం చేసుకుంటాయ‌ని సీపీఐ-ఎంఎల్‌, ఎంఐఎంలు నిరూపించిన‌ట్లు చిదంబ‌రం పేర్కొన్నారు. 

తద్వారా కాంగ్రెస్ సంస్థాగతంగా బలహీనంగా ఉన్నదంటూ పార్టీ అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. క్షేత్ర స్థాయిలో పార్టీని వ్య‌వ‌స్థీకృతంగా బ‌లంగా మారిస్తేనే బీజేపీ కూట‌మిని కొట్ట‌గ‌ల‌మ‌ని చిదంబ‌రం స్పష్టం చేశారు.