ఢిల్లీలో ఇద్దరు జైషే మహమ్మద్ ఉగ్రవాదుల అరెస్ట్  

దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో ఉగ్రవాదుల దాడి వ్యూహాన్ని ఢిల్లీ పోలీసులు రట్టు చేశారు.జైషే మహ్మద్ కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అరెస్టు చేశారు.సోమవారం రాత్రి సారాయ్ కాలేఖాన్ లోని మిలీనియం పార్కు సమీపంలో ఇద్దరు జైషే మహ్మద్ ఉగ్రవాదులను అరెస్టు చేయడంతో ఢిల్లీలో ఉగ్రదాడి గుట్టు రట్టు అయింది. 
 
జమ్మూకశ్మీరుకు చెందిన ఇద్దరు జైషే మహ్మద్ ఉగ్రవాదుల నుంచి రెండు సెమీ ఆటోమేటిక్ పిస్టళ్లు, 10లైవ్ కాట్రిడ్జులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సనావుల్లా మీర్ కుమారుడు అబ్బుల్ లతీఫ్ మీర్ బారాముల్లాలోని పాలా మొహల్లా నివాసి. 
కుష్వారాలోని హాట్ ముల్లా గ్రామంలో నివశిస్తున్న బషీర్ అహ్మద్ కుమారుడు అష్రఫ్ ఖటనలను పోలీసులు అరెస్టు చేశారు. రాజధాని నగరంలో ఉగ్రదాడికి నిందితులు వ్యూహం పన్నారని పోలీసుల దర్యాప్తులో తేలింది.
గత ఆగస్టులో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాది అరెస్టుతో దాడి విఫలం అయింది. దౌలాకువాన్ ప్రాంతంలో అరెస్టు చేసిన ఉగ్రవాది నుంచి పేలుడు పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.