డిజిటల్‌ న్యూస్‌ పోర్టల్స్‌, ఒటిటి ల‌పై ఆంక్షలు 

డిజిటల్‌ న్యూస్‌ పోర్టల్స్‌, ఒటిటి ప్లాట్‌ఫామ్స్‌పై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలకు సిద్ధమైంది. గత ఏడాది మంజూరు చేసిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డిఐ)పై 26 శాతం పరిమితిని పాటించాలని కోరుతూ డిజిటల్‌ న్యూస్‌ పోర్టల్స్‌, ఒటిటి ప్లాట్‌ఫామ్స్‌లకు విడుదల చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది. 

జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఈ నోటిఫికేషన్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇటీవలే డిజిటల్‌ న్యూస్‌ పోర్టల్స్‌, ఒటిటి ప్లాట్‌ఫామ్స్‌ అయిన నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ ప్రైమ్‌లను తమ పరిధిలోకి తీసుకుంటున్నామని కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే.

గత ఏడాది ఆగస్టులో జరిగిన కేబినెట్‌ సమావేశంలో తీసుకున్న ఆదేశాలను పునరుద్ఘాటిస్తూ.. ఈ నిర్ణయం తీసుకున్నామని నోటిఫికేషన్‌లో పేర్కొంది. దీంతో 26 శాతం పరిమితి కంటే తక్కువ పెట్టుబడి కలిగి ఉన్న కంపెనీలు తమ డైరెక్టర్లు, వాటాదారుల పేర్లు, చిరునామాలతో సహా సమాచారం మొత్తం మంత్రిత్వ శాఖకు తెలియచేయాలి. 

ఈ వివరాలను ఒక నెల వ్యవధిలో సమర్పించాల్సి వుంటుందని ఆ నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఒకవేళ 26 శాతం కంటే ఎక్కువ పెట్టుబడులు కలిగిన సంస్థలు అందుకు తగినట్లుగా చర్యలు తీసుకోవాల్సి వుంటుంది. వచ్చే ఏడాది అక్టోబర్‌ 26 నాటికి ఈ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను తగ్గించాల్సి వుంటుంది.