నాసిరకం ఆయుధాలు సరఫరా చేస్తున్న చైనా 

మొబైల్ ఫోన్ సరిగా పనిచేయకపోతే ‘అందుకే.. చైనా ఫోన్లు వాడొద్దు అనేది’ అంటుండటం తరచుగా జరుగుతూ ఉంటుంది. చైనా నుండి కుప్పలు  కుప్పలుగా దిగుమతి అవుతున్న ఎలక్ట్రానిక్ వస్తువుల నాణ్యత విషయంలో ఎవ్వరికీ అపోహాలు లేవు. అవి పనిచేస్తే చేస్తాయి. లేదా పారవేయవలసిందే. ఇప్పుడు చైనా  నుండి పెద్ద  ఎత్తున ఆయుధాలు దిగుమతి చేసుకొంటున్న దేశాలు సహితం గగ్గోలు పెడుతున్నాయి.   అవ్వన్నీ నాసిరకం అని గుర్తించేసరికి జరగవలసిన నష్టం అంతా జరిగిపోతున్నది. 

ప్రపంచంలో ఆయుధాల ఉత్పత్తిలోనే కాకుండా, ఎగుమతులతో సహితం చైనా ఒక ముఖ్యమైన దేశం కావడం తెలిసిందే.  ఇటీవల చైనా రక్షణ రంగ ప్రతినిధులు యుద్ధ వాహనాల అమ్మకానికి ఓ దేశంతో ఒప్పందం కుదుర్చుకున్నారు. టెస్ట్‌ ఫైరింగ్‌ సమయంలో ఒక్కసారి వాహనంలో కూర్చోవాలని కోరగా చైనా ప్రతినిధి అందుకు నిరాకరించారు. 

అంటే తాము తయారు చేసిన ఆయుధ వ్యవస్థలపై చైనాకు అంత నమ్మకం ఉందన్నమాట. ప్రపంచంలోనే చైనా ఐదో అతిపెద్ద ఆయుధ ఎగుమతిదారు. 2015-19 మధ్యకాలంలో అంతర్జాతీయంగా మొత్తం రక్షణరంగ ఉత్పత్తుల ఎగుమతుల్లో చైనా వాటా 5.5 శాతం. 

పాకిస్థాన్‌కు చైనా మిత్ర దేశం. భారత్ కు వ్యతిరేకంగా కుట్రలు పన్నడంలో చేదోడుగా ఉంటున్నది. అటువంటి మిత్రదేశాన్ని సహితం ఆయుధాల సరఫరా విషయంలో చైనా నిట్టనిలువునా మోసం చేస్తున్నది. తన లోపభూయిష్టమైన ఆయుధ వ్యవస్థలను డంపింగ్‌ చేసుకోవడానికి పనికి వచ్చే దేశంగా పాకిస్తాన్ ను వాడుకొంటున్నది.

చైనా తన నాసిరకం ఆయుధ వ్యవస్థల్లో ఎక్కువ శాతం (35%)పాకిస్థాన్‌కే అమ్ముతున్నది. ఇది తెలిసినా కూడా చైనా దగ్గరనే పాకిస్థాన్‌ ఆయుధాలు కొంటున్నది. లేకపోతే అంతర్జాతీయ సమాజంలో తమకు ఉన్న ఒకే ఒక్క పెద్ద దిక్కు కూడా దూరమైపోతుందన్న భయం పాక్‌ది.  అసలే ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్థాన్‌లో చైనా పెట్టుబడులు పెడుతూ ఆదుకుంటున్నది. 2016లో చైనా నుంచి పాకిస్థాన్‌ ఎఫ్‌22పీ యుద్ధనౌకలను కొనుగోలు చేయగా, సాంకేతిక సమస్యలతో అవి మూలన పడ్డాయి.

యుద్ధనౌకల్లో లోపాలున్నాయని, అప్‌గ్రేడ్‌ చేయాలని 2018 సెప్టెంబర్‌లో పాక్‌ కోరగా చైనా పట్టించుకోలేదు. 2019లో  తొమ్మిది ఎల్వై -80 ‘మొబైల్‌ మిస్సైల్‌ సిస్టమ్‌’లతో కూడా యుద్ధవాహనాలను కొనుగోలు చేయగా అందులో మూడు పనిచేయడం లేదు.

బంగ్లాదేశ్‌ 2017లో చైనా నుంచి రెండు జలాంతర్గాములను ఒక్కొక్కటి దాదాపు రూ. 800 కోట్లు చొప్పున వెచ్చించి కొనుగోలు చేసింది. సాంకేతిక సమస్యలు తలెత్తడంతో అవి మూలనపడ్డాయి. చైనా మొదట వీటిని పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ శిక్షణలో ఉపయోగించి బంగ్లాదేశ్‌కు  అంటగట్టింది.మళ్లీ 2020లో బంగ్లాదేశ్‌ రెండు 053H3 జలాంతర్గాములను కొన్నది. వాటిలో రాడార్‌ వ్యవస్థ పనిచేయడం లేదు. దీనిపై చైనాను అడగ్గా మరమ్మతుల కోసం అదనంగా డబ్బులు చెల్లించాలని దబాయిస్తున్నది.

చైనా ఆయుధ సామగ్రి నాసిరకంగా ఉండటంపై మయన్మార్‌ కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నది. “చైనా నుంచి కొన్నది కదా.. అది చెడిపోకుండా ఎట్లా ఉంటుంది..’ మయన్మార్‌ సైన్యంలో తరచూ వినిపించే మాట ఇది. దీంతో మయన్మార్‌ ఆయుధాల దిగుమతుల కోసం భారత్ వైపు చూస్తున్నది. భారత్‌ ఇప్పటికే మయన్మార్‌కు సింధువీర్‌ సబ్‌మెరైన్‌ను విక్రయించింది.

నేపాల్‌ కథ మరోలా ఉన్నది. చైనా నుంచి దిగుమతి చేసుకున్న వై12ఇ, ఎంఎ 60 రకానికి చెందిన ఆరు యుద్ధవిమానాలు ప్రస్తుతం ఎటూ పనికిరాకుండా ఉన్నాయి. వీటిని తొలుత బంగ్లాదేశ్‌ తిరస్కరించడంతో చైనా నేపాల్‌కు అంటగట్టింది. వాటిని రీప్లేస్‌ చేయాలని నేపాల్‌ కోరితే చైనా ససేమిరా అంటున్నది.

కెన్యా 2016లో విఎన్-4 క్షిపణులను ప్రయోగించగల యుద్ధ వాహనాలను దిగుమతి చేసుకున్నది. వీటి పనితీరు ఎలా ఉందంటే టెస్ట్‌ ఫైరింగ్‌ సమయంలో చైనా సేల్స్‌ రిప్రజెంటేటివే ఇందులో కూర్చోవడానికి నిరాకరించారు. ఈ వాహనాలు విఫలం కావడం వల్ల కెన్యా బలగాల్లో కొంత మంది మరణించారు.

అల్జీరియా, జోర్డాన్‌లు చైనా నుంచి సిహెచ్-4బి  మానవరహిత యుద్ధ డ్రోన్లను కొనుగోలు చేయగా, చాలా వరకు ప్రమాదాలకు గురయ్యాయి.  జోర్డాన్‌ ఆరు మానవరహిత డ్రోన్లను కొనుగోలు చేయగా అవి పనిచేయకపోవడంతో కేవలం 3 ఏండ్లలోనే వాటిని ధ్వంసం చేసింది.