భారత్‌లో 20 రకాల వ్యాక్సిన్ల ప్రయోగాలు

వ్యాక్సిన్‌ ప్రయోగాల్లో భారత్ ముందుందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ తెలిపారు. ఇప్పటికే 20 రకాల వ్యాక్సిన్లకు సంబంధించి క్లినికల్‌ ట్రయల్స్‌  భారత్‌లో జరుగుతున్నాయని ఆయన చెప్పారు. 

అందులో భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌)-భారత్‌ బయోటెక్‌ సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న కోవాక్సిన్‌, సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా అభివృద్ధి చేస్తున్న కోవిషీల్డ్‌ మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌లో ఉన్నాయని పేర్కొన్నారు.

 బ్రిక్స్‌ మంత్రుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేవలం వ్యాక్సిన్‌ పరిశోధనకు భారత ప్రభుత్వం రూ.894 కోట్లను కేటాయించిందని వెల్లడించాయిరు. 

ఇలా ఉండగా, రష్యాకు చెందిన స్పుత్నిక్ వి వ్యాక్సిన్ ఫస్ట్ బ్యాచ్ యూపీలోని కాన్పూర్‌లోగల గణేశ్ శంకర్ విద్యార్థి మెడికల్ కాలేజీకి చేరుకోనుంది. అక్కడ వ్యాక్సిన్‌కు సంబంధించిన రెండవ, మూడవ దశల హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్ జరగనున్నాయి. 

మీడియాకు అందిన వివరాల ప్రకారం హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్… డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతి పొందింది.

కాగా, సంపన్న దేశాల భారీ సంఖ్యలో వ్యాక్సిన్‌ డోసులకోసం అడ్వాన్స్‌గా బుక్‌ చేసుకోవడంతో పేద దేశాలకు వ్యాక్సిన్‌ అందడం మరింత ఆలస్యమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. పలు పేదదేశాలు తమ ప్రజలకు వ్యాక్సిన్‌ అందించే ప్రక్రియ 2024 వరకు కొనసాగే పరిస్థితులు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.