బీహార్ ఎన్నికల ఫలితాల పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ నామినేటెడ్ కమిటీలతో ఎన్నికలకు వెడితే ఫలితాలు ఇదే విధంగా ఉంటాయని కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబాల్ ఎద్దేవా చేశారు. నామినేషన్ల సాంప్రదాయానికి స్వస్తి పలకాలని డిమాండ్ చేశారు.
పార్టీ పెద్దలు ఇలా మౌనంగా ఉంటే కాంగ్రెస్ పార్టీ మరింత పతనం అవుతుందని కపిల్ హెచ్చరించారు దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఓ ప్రత్యామ్నాయంగా చూడడం లేదని వాపోయారు. ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కాంగ్రెస్ పార్టీలో అంతర్గత సంక్షోభం ఉందన్న సంకేతాల్ని ఆయన మరోసారి వినిపించారు.
భవిష్యుత్తును దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీని కొత్త మార్గంలో నడిపాలని పార్టీ అధిష్టానానికి హితవు చెప్పారు. పార్టీలో నాయకత్వం మార్పు కోరుతూ పలువురు సీనియర్ నేతలు నేరుగా సోనియా గాంధీకి లేఖ వ్రాయడంతో బహిర్గతమైన పార్టీలోని అసమ్మతి స్వరాలు కొనసాగుతూ ఉండటం గమనార్హం. కమ్యూనికేషన్ విప్లవానికి అనుగుణంగా ముందుకు వెళ్లాలని సిబాల్ పేర్కొన్నారు.
బీహార్ ఎన్నికల్లో ఆర్జేడీ .. ప్రత్యామ్నాయ పార్టీగా నిలిచిందని కపిల్ తెలిపారు. గుజరాత్‌లో జరిగిన ఉప ఎన్నికలలోనూ కాంగ్రెస్ ఓటమి పాలైందని గుర్తు చేశారు. ఆ రాష్ట్రంలో ఒక్క సీటు కూడా గెలవలేదని విచారం వ్యక్తం చేశారు. లోక్‌సభలోనూ ఆ రాష్ట్రంలో సీటు సాధించకపోవడం శోచనీయమని పేర్కొన్నారు.
యూపీలో జరిగిన ఉప ఎన్నికల్లో కూడా కొన్ని చోట్ల 2 శాతం ఓట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి పోలవ్వలేదని గుర్తు చేస్తూ పరోక్షంగా ప్రియాంక గాంధీ నాయకత్వంపై దాడి చేశారు. ఈ దశలో కాంగ్రెస్ పార్టీ అవలోకనం చేసుకోవాలన్న అభిప్రాయాలు వినిపిస్తున్నట్లు కపిల్ సిబల్ తెలిపారు.
బీహార్‌లో సీట్ల పంపకం విషయంలో కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసిందని సీనియర్ నేత తారిక్ అన్వర్ తెలిపారు. ఎక్కడ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నా.. అక్కడ వీలైనంత తర్వగా కూటమిలను ఏర్పాటు చేయాలని పార్టీ అధిష్టానానికి సూచించారు. ఆలస్యం జరిగితే.. ఓటమి అనివార్యం అవుతోందని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి లోపాలు ఉన్నాయో తెలుసు అని, వ్యవస్థీకృతంగా ఎటువంటి తప్పులు జరుగుతున్నాయో తెలుసని కపిల్ సిబల్ పేర్కొన్నారు. అన్నింటికీ సమాధానాలు ఉన్నాయని, కాంగ్రెస్ పార్టీకి ఆ సమాధానాలు తెలుసు అని, కానీ ఆ సమాధానాలను వాళ్లు పట్టించుకోవడం లేదని పరోక్షంగా సోనియా గాంధీ కుటుంబంపై మండిపడ్డారు.
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఓ నామినేటెడ్ వ్యవస్థ అని, నామినేట్ అయిన సభ్యులను ఓటమి గురించి ఏమీ ప్రశ్నించలేమని ఎద్దేవా చేశారు. గతంలో అధినాయకత్వానికి పంపిన ధిక్కార లేఖపై స్పందిస్తూ.. హై కమాండ్ ఎటువంటి సంస్కరణలు చేపట్టేందుకు ఆసక్తిగా లేనట్లు తెలుస్తోందని విచారం వ్యక్తం చేశారు.
తాము ఇచ్చిన ఫిర్యాదులను హైకమాండ్ పట్టించుకోలేదని, అందుకే ఇలాంటి ఫలితాలను ఎదుర్కోవాల్సి వస్తోందని పేర్కొన్నారు. అనుభవం ఉన్న వారితో పార్టీ పెద్దలు మాట్లాడాలని, దేశంలో రాజకీయ వాస్తవాలు మారుతున్నాయని హితవు చెప్పారు. బీహార్ ఫలితాలపై హైకమాండ్ ఎటువంటి పరిశీలన చేయలేదని, అంతా బాగుందన్న ఆలోచనలో వారు ఉండి ఉంటారని కపిల్ ఎద్దేవా చేశారు.
More Stories
తుది దశకు చేరుకున్న వామపక్ష తీవ్రవాదం
దుర్గామాతపై గర్భా గీతం రాసిన ప్రధాని మోదీ
గోమాత విజ్ఞాన పరీక్షా పోస్టర్ ఆవిష్కరించిన భగవత్