
దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ గ్రహీత, బెంగాలి నటుడు సౌమిత్ర ఛటర్జీ కన్నుమూశారు. కొంత కాలంగా కరోనాతో బాధపడుతున్న ఆయన ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అక్టోబర్ 6న ఆయనకు కరోనా పాజిటివ్ నిర్ణారణ కాగా, కోల్‌కతాలోని బెల్లెవ్ నర్సింగ్ హోంకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
అయితే ఈ రోజు ఆరోగ్యం మరింత విషమించడంతోఆదివారం కన్నుమూశారు. ఆయన మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం షూటింగ్స్‌కు వెసులు బాటు కల్పించిన సమయంలో సౌమిత్ర ఛటర్జీ.. అభియాన్ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ మూవీ తెరకెక్కిస్తున్న సమయంలోనే అతనికి కరోనా సోకి ఉంటుందని తెలుస్తుంది.
న్యుమోనియాతో పాటు వయస్సు రీత్యా ఆయన కోలుకోలేక కన్నుమూశారు. 85 ఏళ్ళ వయస్సులో కన్నుమూసిన సౌమిత్ర ఛటర్జీ 1935 జనవరి 19న జన్మించారు. సత్యజిత్ రే దర్శకత్వంలో 1959లో తెరకెక్కిన ‘అపుర్ సంసార్’ మూవీతో నటుడిగా బెంగాలీ చిత్రసీమకు పరిచయమయ్యారు. ఆ తర్వాతా అద్భుతమైన సినిమాలు చేస్తూ బెంగాలి తొలి తరం నటుల్లో అగ్రగణ్యుడిగా మారాడు.
సౌమిత్రకు ఉత్తమ నటుడిగా ఒక జాతీయ పురస్కారంతోపాటు మరోవైపు స్పెషల్ జ్యూరీ విభాగంలో మరో రెండు జాతీయ అవార్డులు వచ్చాయి. మొత్తంగా మూడు జాతీయ అవార్డులు అందుకున్నారు. సత్యజిత్ రేతో కలిసి చాలా సినిమాలు చేసిన సౌమిత్ర 2004లో పద్మభూషణ్ అందుకున్నారు.
2012లో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుతో కేంద్రం ఆయనను గౌరవించింది. ఎన్నో అద్భుతమైన సినిమాలతో ప్రేక్షకులని అలరించిన సౌమిత్ర మరణం బెంగాలీ పరిశ్రమని కంటతడి పెట్టిస్తుంది.
సౌమిత్రా ఛటర్జి (85) మృతి పట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సంతాపం తెలియజేశారు. నటనా రంగానికి సౌమిత్రా చటర్జి చేసిన సేవలు మరువలేనవని రాష్ట్రపతి ట్విట్టర్‌లో పేర్కొన్నారు. సౌమిత్రా చటర్జి మరణం ద్వారా భారత సినీ పరిశ్రమ ఒక లెజెండ్‌ను కోల్పోయిందని, సత్యజిత్ రే దర్శకత్వంలో వచ్చిన చాలా సినిమాల్లో సౌమిత్రా చటర్జి తన అద్భుతమైన నటనతో ప్రేక్షకుల మెప్పు పొందారని రాష్ట్రపతి ట్వీట్ చేశారు.
సౌమిత్రా ఛటర్జీ మరణం ప్రపంచానికి పశ్చిమబెంగాల్, భారత దేశ సాంస్కృతిక రంగానికి తీరని లోటు అని ప్రధాని నరేంద్ర మోదీ ఒక సందేశంలో పేర్కొన్నారు. ఛటర్జీ మరణంతో తనను తీవ్ర విచారంలో ముంచెత్తిందని ఆయన చెప్పారు. ఛటర్జీ కుటుంబానికి ఆయన సంతాపం తెలిపారు. కుటుంబసభ్యులు ధైర్యంగా ఉండాలని సూచించారు.
చటర్జీ మృతిపట్ల పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ తీవ్రదిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘ఫెలూదా’ ఇకలేరు. ‘అపు’ గుడ్ బై చెప్పారు. సౌమిత్ర ఛటర్జీకి కన్నీటి వీడ్కోలు. బెంగాలీ, జాతీయ, అంతర్జాతీయ సినీ పరిశ్రమ ఓ పెద్ద దిక్కును కోల్పోయింది. సత్యజిత్ రే వంటి దిగ్గజ దర్శకులతో పనిచేసి దాదాసాలెబ్ ఫాల్కే అవార్డు, బంగా విభూషణ్, పద్మ భూషణ్ తోపాటు పలు జాతీయ అవార్డులను అందుకున్నారు. ఆయని లేని లోటుతో బెంగాలీ సినీపరిశ్రమ అనాథగా మారిందని సీఎం మమతా బెనర్జీ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు.
More Stories
జగన్నాథుడి ఆలయ శిఖరంపై ముడిపడిన జెండాలు
ఓటుకు ఆధార్ లింక్‌పై 18న ఈసీ భేటీ
అమృత్‌సర్‌లో గుడిపై గ్రేనేడ్ దాడి