16 నుంచి షిర్డీ సాయి ఆలయ దర్శనం 

16 నుంచి షిర్డీ సాయి ఆలయ దర్శనం 
షిర్డీలోని ప్రఖ్యాత సాయిబాబా మందిరాన్ని ఈనెల 16 నుంచి భక్తులు సందర్శించుకోవచ్చు. గత మార్చిలో కోవిడ్ లాక్‌డౌన్ నేపథ్యంలో మూతపడిన రాష్ట్రంలోని ఆలయాలు, ప్రార్థనా మందిరాలను తిరిగి తెరుస్తున్నట్టు మహారాష్ట్ర సర్కార్ ప్రకటించింది. 
 
ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ, కోవిడ్ హెచ్చరికలు కూడా చేశారు. కరోనా మహమ్మారి ఇంకా మన మధ్యే ఉన్న విషయాన్ని మరువరాదని, వైరస్ క్రమంగా మౌనం దాల్చినప్పటికీ దానిపట్ల నిర్లక్ష్యం కూడదని స్పష్టం చేశారు. 
 
హోలి, గణేష్ చతుర్ధి, నవరాత్రి, పండరీపూర్ వారి (వార్షిక యాత్ర) తరహాలోనే కోవిడ్ సేఫ్టీ ప్రోటోకాల్ పాటించాలని కోరారు.  సోమవారంనాడు (16వ తేదీ) కాకడ్ హారతి పూర్తయిన తర్వాత నుంచి భక్తులను సాయిబాబాను దర్శించుకునేందుకు ఆలయ నిర్వాహకులు అనుమతించనున్నారు.
కోవిడ్ సేఫ్టే ప్రోటోకాల్ ప్రకారం, గంటకు 900 మంది భక్తుల చొప్పున రోజుకు 6,000 మంది భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు. భక్తులు ఆన్‌లైన్ ద్వారా దర్శనానికి దరఖాస్తు చేసుకోవాలి. షిర్డీ‌లోని కౌంటర్ ద్వారా కూడా టోకెన్లు పొందవచ్చు. 65 ఏళ్లు పైబడిన వృద్ధులను, పదేళ్లలోపు పిల్లలను అనుమతించరు. ప్రతి భక్తులు సామాజిక దూరం పాటించడంతో పాటు, తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. భక్తులు ఆలయంలోకి అడుగుపెట్టిన వెంటనే పాదాలను ప్రక్షాళన చేసుకోవాలి.
 
కాగా, ముంబైలోని ప్ర‌సిద్ధ సిద్ధివినాయ‌క్ ఆల‌యం కూడా భ‌క్తుల ద‌ర్శ‌నం నిమిత్తం సోమవారం  తిరిగి తెరుచుకోనుంది. క‌రోనా నేప‌థ్యంలో ఆల‌య నిర్వాహ‌కులు ద‌ర్మ‌నం, పూజా కార్య‌క్ర‌మాల‌ నిమిత్తం ప్ర‌త్యేక ఏర్పాట్లు చేసింది. భ‌క్తుల సౌక‌ర్యం నిమిత్తం ప్ర‌త్యేక యాప్‌ను ప్రారంభించింది.
 
 స్లాట్ బుకింగ్ ద్వారా ప్ర‌త్యేక పూజ‌లు, ద‌ర్శ‌నం చేసుకోవ‌చ్చు. మొబైల్ ఫోన్ లేని భ‌క్తుల కోసం ఆల‌యం వ‌ద్దే కౌంట‌ర్ల‌ను ఏర్పాటు చేసింది. క్యూఆర్ కోడ్ ద్వారా ద‌ర్శ‌నం బుక్ చేసుకోవ‌చ్చు. ఆన్‌లైన్‌లో బుక్ చేసిన త‌ర్వాత‌ ఈ క్యూఆర్ కోడ్‌ను ప్ర‌వేశ‌ద్వారం వ‌ద్ద చూపించాల్సి ఉంటుంది. ఆలయాన్ని సందర్శించే భక్తులకు థర్మల్ స్క్రీనింగ్, మాస్క్‌లు తప్పనిసరి చేసింది. సీనియర్ సిటిజన్లు ఇంట్లోనే ఉండాల్సిందిగా సూచించారు.