పాక్ ఉగ్రవాదుల జాబితా పట్ల భారత్ ఆగ్రహం 

పాకిస్తాన్ ప్రభుత్వం విడుదల చేసిన ఉగ్రవాదుల జాబితాలో  2008 ముంబై దాడులతో సంబంధం ఉన్న 19 మంది అనుమానితులను  చేర్చలేదు. ఈ జాబితాను భారత్ గురువారం తోసిపుచ్చింది. ఈ జాబితాలో ముంబై మారణహోమం సూత్రధారి, ముఖ్య కుట్రదారులను స్పష్టంగా వదిలివేసినట్లు తెలుస్తున్నదని భారత్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది.
పాకిస్తాన్‌ ప్రభుత్వం వాంటెడ్ టెర్రరిస్టుల జాబితాను విపాకిస్తాన్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎఫ్ఐఏ) వెబ్‌సైట్‌లో పోస్ట్ చేశారు. ముంబైకి ప్రయాణించడానికి ఉగ్రవాదులు ఉపయోగించే రెండు పడవల్లోని సిబ్బంది, డబ్బు బదిలీల ద్వారా దాడులకు ఆర్థిక సహాయం చేసిన వారి పేర్లు ఎక్కువగా ఈ జాబితాలో ఉన్నాయి.
19 మంది పురుషులలో ఎక్కువ మంది లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) సభ్యులే ఉండటం విశేషం. ఈ జాబితా పూర్తిగా అసంబద్ధంగా ఉన్నదని, ముంబై మారణహోమం సృష్టించేందుకు సూత్రధారి, కుట్రదారులను జాబితాలో పొందుపరచకపోవడం అవివేకం అని భారత్‌ విమర్శించింది.
“26/11 ముంబై ఉగ్రవాద దాడులకు పాల్పడిన అనేక మంది పాకిస్తానీ పౌరులు” ఉన్న మోస్ట్ వాంటెడ్, హై-ప్రొఫైల్ ఉగ్రవాదుల జాబితాను ఎఫ్‌ఐఏ విడుదల చేయడం గురించి పాకిస్తాన్‌లో మీడియా నివేదికలు ఉన్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ పేర్కొన్నారు.
“ఈ జాబితాలో పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఐక్యరాజ్యసమితి ఉగ్రవాద సంస్థగా గుర్తించిన లష్కర్-ఏ-తైబాకు చెందిన కొంతమంది సభ్యులు ఉన్నారు. 26/11 దాడులను అమలు చేయడానికి ఉపయోగించే పడవల సిబ్బందితో పాటు సూత్రధారి, ముఖ్య కుట్రదారులను స్పష్టంగా వదిలివేసినట్లు జాబితాను బట్టి తెలుస్తున్నది” చెప్పారు.
టెర్రర్ ఫైనాన్సింగ్ కేసులో దోషిగా తేలి ప్రస్తుతం లాహోర్ జైలులో ఉన్న ఎల్‌ఈటీ వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ ముంబై దాడులకు సూత్రధారి అని భారత్ ఆరోపించింది. 2008 నవంబర్ దాడులతో హఫీజ్‌ సయీద్‌ను నేరస్థుడని తెలిపే ఆధారాలు ఏవీ లేవని పాకిస్తాన్ పదేపదే వాదించింది.
“పాకిస్తాన్ కేంద్రంగా ముంబై ఉగ్రవాద దాడుల కుట్రదారులు, ఫెసిలిటేటర్లపై అవసరమైన సమాచారం, ఆధారాలను పాకిస్తాన్ కలిగి ఉన్నదని జాబితా స్పష్టం చేస్తుంది ” అని శ్రీవాస్తవ పేర్కొన్నారు. ముంబై ఉగ్రవాద దాడుల విచారణలో అంతర్జాతీయ బాధ్యతలను నిర్వర్తించడంలో పాకిస్తాన్ ప్రభుత్వానికి అస్పష్టత, విడదీసే వ్యూహాలను వదులుకోవాలని భారత ప్రభుత్వం పలుమార్లు సూచించింది.