చైనా ప్రభుత్వం తీరుకు హాంకాంగ్ ప్రజలు అట్టడుకుతున్నారు. జిన్‌పింగ్ నియంతృత్వ పోకడలకు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. హాంకాంగ్ ప్రజాస్వామ్య అనుకూల శాసనసభ్యులు నలుగురిని సెమి అటానమస్ చైనీస్ భూభాగం శాసనసభ నుంచి చైనా ప్రభుత్వం బహిష్కరించింది. దీనికి నిరసనగా ప్రతిపక్ష ప్రజాప్రతినిధులు సామూహికంగా రాజీనామా చేశారు.
నగర న్యాయస్థానాలకు వెళ్ళకుండానే రాజకీయ నాయకులను తొలగించటానికి స్థానిక అధికారులకు అధికారం ఇచ్చే చైనా అత్యున్నత శాసనసభ తీర్మానాన్ని వారు నిరసించారు. రాజీనామా లేఖలను గురువారం సమర్పించనున్నట్లు శాసనసభ్యులు వెల్లడించారు.
ఆల్విన్ యెంగ్, డెన్నిస్ క్వాక్, క్వాక్ కా-కి, కెన్నెత్ తెంగ్ అనే నలుగురు శాసనసభ్యులను అనర్హులుగా ప్రకటించినట్లు హాంకాంగ్ ప్రభుత్వం చెప్పిన కొన్ని గంటల తర్వాత వీరి సామూహిక రాజీనామా ప్రకటన వచ్చింది. మిగిలిన 15 ప్రజాస్వామ్య అనుకూల శాసనసభ్యుల రాజీనామా హాంకాంగ్ భవిష్యత్‌పై ఉద్రిక్తతలను రేకెత్తిస్తున్నది.
ఇది ఒకప్పుడు బ్రిటిష్ కాలనీగా ఉండేది. ప్రాంతీయ ఆర్థిక కేంద్రంగా, పాశ్చాత్య తరహా పౌర స్వేచ్ఛ బురుజుగా ఉన్నది. అయితే చైనా ప్రభుత్వం హాంకాంగ్‌ను తన ఆజమాయిషీలోకి తీసుకుని తన కఠిన చట్టాలను అమలుచేయడం ప్రారంభించింది. ఈ ఏడాది చైనా ప్రభుత్వం విధించిన కొత్త జాతీయ భద్రతా చట్టం అంతర్జాతీయ సమాజాన్ని భయపెట్టింది.
చైనా జాతీయ పీపుల్స్ కాంగ్రెస్ స్టాండింగ్ కమిటీ ఈ వారం ఒక తీర్మానాన్ని ఆమోదించిన తరువాత, హాంకాంగ్ స్వాతంత్రయానికి మద్దతు ఇచ్చే ఏ చట్టసభ సభ్యుడు, నగరంపై చైనా సార్వభౌమత్వాన్ని అంగీకరించడానికి నిరాకరించడం, జాతీయ భద్రతకు ముప్పు కలిగించడం లేదా నగర వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాలని బాహ్య శక్తులను కోరడం వంటివి చేసినవారిని అనర్హులుగా గుర్తిస్తారు.
హాంకాంగ్ స్వాతంత్రయాన్ని ప్రోత్సహించడం, జాతీయ భద్రతకు ముప్పు కలిగించే చర్యలకు పాల్పడటం వంటి నిర్దిష్ట పరిస్థితులలో చట్టసభ సభ్యులు వెంటనే తమ సీట్లను కోల్పోతారని ప్రభుత్వం నేతృత్వంలోని జిన్హువా వార్తా సంస్థ నివేదించింది. ప్రస్తుతం నిషేధానికి గురైన నలుగురు శాసనసభ్యులు ఎన్నికల్లో పాల్గొనేందుకు కూడా అనర్హులుగా తేల్చారు.
ఈ నలుగురిని మొదట జూలైలో లెగ్కో ఎన్నికలలో పోటీ చేయకుండా అనర్హులుగా ప్రకటించారు. తరువాత కరోనా వైరస్ మహమ్మారి ఆందోళనలను చూపుతూ ప్రభుత్వం ఒక ఏడాదిపాటు వీరిపై అనర్హతను వాయిదా వేసింది.
“మా భాగస్వాములు, మా సహచరులను కేంద్ర ప్రభుత్వం తన క్రూరమైన చర్యతో అనర్హులుగా ప్రకటించింది. దీనికి నిరసనగా ఈ రోజు మేమంతా మా పదవులకు రాజీనామా చేస్తున్నాం” అని ప్రజాస్వామ్య అనుకూల శిబిరం నాయకుడు వు చి-వై చెప్పారు. కాగా, హాంకాంగ్‌లో న్యాయ పాలన, రాజ్యాంగ క్రమాన్ని కొనసాగించడానికి అనర్హత వేటు వేయడం అవసరం” అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్బిన్ స్పష్టం చేశారు.
More Stories
గాజాలో 19న మొదటి విడత బందీల విడుదల!
ఇమ్రాన్ ఖాన్‌కు 14 ఏళ్ళు, భార్యకు 7 ఏళ్ళు జైలు
రష్యా తరుఫున యుద్ధంలో 12 మంది భారతీయులు మృతి