ప్రధాని మోదీకి డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్ ప్రశంసలు

మన దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనోమ్ ప్రశంసలు కురిపించారు. కొవిడ్‌ వ్యాక్సిన్‌ తయారు చేసి, అందరి అవసరాలు తీర్చే శక్తి సామర్థ్యాలు భారత్‌కు ఉన్నాయని ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీని టెడ్రోస్‌ అథనోమ్‌ అభినందించారు. 
 
‘‘ప్రపంచ మానవాళి పట్ల మీ సంఘీభావానికి కృతజ్ఞతలు. వనరులు, బలాలు ప్రోది చేసుకుని పరస్పర సహకారంతో జాతి శ్రేయస్సు కోసం పనిచేస్తేనే కొవిడ్‌ 19 మహమ్మారి నుంచి బయటపడొచ్చు’’ అని టెడ్రోస్ ట్వీట్‌ చేశారు. కరోనా మహమ్మారిని అంతం చేసేందుకు భుజం భుజం కలిపి పనిచేయడానికి మోదీ అంగీకరించారు అని టెడ్రోస్ పేర్కొన్నారు.  
 
 ‘‘నమస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ…సంప్రదాయ వైద్యంలో మీ సహకారం, జ్ఞానం, పరిశోధన, శిక్షణలను బలోపేతం చేయాలనే దానిపై భారత పాత్రను ప్రపంచఆరోగ్య సంస్థ స్వాగతిస్తోంది’’ అని టెడ్రోస్ పేర్కొన్నారు. 
 
కొవిడ్-19తో పోరాడటానికి ప్రపంచ దేశాలకు భారతదేశం సహాయపడుతోందని మోదీ చెప్పారు. టీకా ఉత్పత్తి సామర్థ్యం, ​​మంచి కోసం వనరులను సమీకరించడం ద్వారా మాత్రమే మహమ్మారిని ఓడించవచ్చునని మోదీ చెప్పారు. 
 
ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం 75వ సమావేశంలో ప్రసంగించిన మోదీ, ‘‘ప్రపంచంలోనే అతిపెద్ద టీకా ఉత్పత్తి చేసే దేశంగా నేను ఈ రోజు ప్రపంచ సమాజానికి మరో హామీ ఇవ్వాలనుకుంటున్నాను’’ అని మోదీ చెప్పారు.