మళ్లీ ముంబైదే ఐపీఎల్  టైటిల్‌

డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌  మళ్లీ ఐపీఎల్  టైటిల్‌ను ఎగురేసుకుపోయింది.  ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఫైనల్‌ పోరులో ముంబై ఇండియన్స్‌  5 వికెట్ల తేడాతో గెలిచి టైటిల్‌ను మరొకసారి ముద్దాడింది. ఇది ముంబై ఇండియన్స్‌ ఐదో ఐపీఎల్‌ టైటిల్‌ కావడం విశేషం.
 
ఢిల్లీ నిర్దేశించిన 157 పరుగుల టార్గెట్‌ను ముంబై 18.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. రోహిత్‌ శర్మ(68; 51 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) రాణించి విజయంలో కీలక పాత్ర పోషించగా, ఇషాన్‌ కిషన్‌( 33 నాటౌట్‌; 19 బంతుల్లో 3 ఫోర్లు, 1సిక్స్‌) ఫినిషింగ్‌ టచ్‌ ఇచ్చాడు. 
 
టార్గెట్‌ను ఛేదించే క్రమంలో డీకాక్‌-రోహిత్‌ శర్మలు ఇన్నింగ్స్‌ను ఆరంభించారు. వీరిద్దరూ ఆది నుంచి విరుచుకుపడి ముంబై స్కోరును పరుగులు పెట్టించారు. స్టోయినిస్‌ వేసిన ఐదో ఓవర్‌ తొలి బంతికి డీకాక్‌(20; 12 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌) ఔటయ్యాడు. దాంతో 45 పరుగుల వద్ద ముంబై తొలి వికెట్‌ను కోల్పోయింది. 
 
ఆ తరుణంలో రోహిత్‌కు సూర్యకుమార్‌ యాదవ్‌ జత కలిశాడు. ఈ జోడి 45 పరుగులు జత చేసిన తర్వాత సూర్యకుమార్‌(19; 20 బంతుల్లో 1 ఫోర్‌, 1 సిక్స్‌) రనౌట్‌ అయ్యాడు. అటు తర్వాత రోహిత్‌- ఇషాన్‌ కిషన్‌లు జోడి 47 పరుగులు జత చేసింది. 
 
ముంబై స్కోరు 137 పరుగుల వద్ద ఉండగా రోహిత్‌ మూడో వికెట్‌గా ఔట్‌ కాగా, పొలార్డ్‌(9; 4 బంతుల్లో 2 ఫోర్లు) నాల్గో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. హార్దిక్‌ పాండ్యా(3) నిరాశపరిచాడు.

ముందుగా బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్‌ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు నష్టానికి 156 పరుగులు చేసింది.  రిషభ్‌ పంత్‌(56; 38 బంతుల్లో 4 ఫోర్లు, 2సిక్స్‌లు), శ్రేయస్‌ అయ్యర్‌(65 నాటౌట్‌; 50 బంతుల్లో 6 ఫోర్లు, 2సిక్స్‌లు)లు రాణించడంతో ఢిల్లీ గౌరవప్రదమైన స్కోరు చేసింది. 

ఈ మ్యాచ్‌లో రిషభ్‌ పంత్‌ హాఫ్‌ సెంచరీ చేయడం ద్వారా రికార్డు సాధించాడు. ఐపీఎల్‌ చరిత్రలో ఫైనల్‌ మ్యాచ్‌లో హాఫ్‌ సెంచరీ సాధించిన రెండో పిన్నవయస్కుడిగా పంత్‌ గుర్తింపు పొందాడు. పంత్‌ 23 ఏళ్ల 37 రోజుల వయసులో ఐపీఎల్‌ ఫైనల్‌లో అర్థ శతకం సాధించగా, అంతకుముందు మనన్‌ వోహ్రా పిన్న వయస్కుడిగా రికార్డు సాధించాడు. 

2014లో  కింగ్స్‌ పంజాబ్‌ ఫైనల్‌కు వెళ్లిన మ్యాచ్‌లో వోహ్రా అర్థ శతకం నమోదు చేశాడు. వోహ్రా 20 ఏళ్ల 318 రోజుల వయసులో హాఫ్‌ సెంచరీ సాధించాడు. ఆనాటి మ్యాచ్‌లో వోహ్రా 67 పరుగులు చేశాడు.