రిపబ్లిక్ టీవీ డిస్ట్రిబ్యూషన్ హెడ్ అరెస్ట్

టీఆర్‌పీ రేటింగ్స్ కేసులో ముంబై పోలీసులు నేడు రిప‌బ్లిక్ టీవీ డిస్ట్రిబ్యూషన్ హెడ్‌ను అరెస్టు చేశారు. రిప‌బ్లిక్ టీవీ న్యూస్ ఛానల్ కార్యక్రమాలను ఎక్కువగా వీక్షించినట్లు చూపించడానికి రేటింగ్‌లను తారుమారు చేశారనే ఆరోపణలతో డిస్ట్రిబ్యూషన్ హెడ్ ఘ‌న్‌శ్యామ్‌సింగ్‌ను అరెస్టు చేశారు. 
 
రిప‌బ్లిక్ టీవీ సీఈవో, యాంక‌ర్ అర్నాబ్ గోస్వామిని ఓ వ్య‌క్తి ఆత్మ‌హ‌త్య కేసులో పోలీసులు ఇప్ప‌టికే అరెస్టు చేసిన సంగ‌తి తెలిసిందే. ఘ‌న్‌శ్యామ్‌సింగ్‌ను పోలీసులు నేడు కోర్టు ముందు హాజ‌రుప‌ర‌చ‌నున్నారు. 
 
రిప‌బ్లిక్ టీవీని ఎల్ల‌ప్పుడు చూసేలా ఉంచ‌డానికి కొంత‌మంది వీక్ష‌కుల‌కు స‌ద‌రు వ్య‌క్తులు డ‌బ్బులు ఇచ్చిన‌ట్లుగా ఆరోప‌ణ‌లు. టీఆర్‌పీ కేసులో పోలీసులు అంత‌కుక్రిత‌మే స్థానిక చానెల్స్ ఫ‌క్త్ మ‌రాఠి, బాక్స్ సినిమాను విచార‌ణ‌లో చేర్చారు. 
 
టీఆర్‌పీ కుంభకోణం వార్తల పోకడలను తారుమారు చేయడం అదేవిధంగా తప్పుడు కథనాల వ్యాప్తికి ఎలా దోహ‌దం చేస్తుంద‌నే దానిపై పెద్ద విశ్లేష‌ణే జ‌రిపారు. దీనికి నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణమే ఉదాహ‌ర‌ణ‌గా ముంబై పోలీసులు పేర్కొంటున్నారు.