ప్రభుత్వ పరిధిలోకి సోషల్ మీడియా, ఓటిటి ప్లాటుఫార్మ్స్ 

సోషల్‌మీడియా, ఆన్‌లైన్‌ న్యూస్‌ పోర్టల్స్‌ ఇంకా కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలోకి రానున్నాయి. ఆన్‌లైన్‌ న్యూస్‌ పోర్టల్స్‌ అయిన నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో, హాట్‌స్టార్‌లతో పాటు సోషల్‌మీడియా వేదికలైన ఫేస్‌బుక్‌, ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌లు ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్లనున్నాయి. 
 
ఇవన్నీ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోకి వచ్చేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సంతకం చేసిన ఉత్తర్వులను జారీ చేసింది. ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌లోని సినిమాలు, ఆడియో విజువల్స్‌, వార్తలు, కరెంట్‌ అఫైర్స్‌ వంటి అన్నింటినీ సమాచార మంత్రిత్వ శాఖ తన పరిధిలోకి తీసుకోనుంది.
 
ఇప్పటివరకు డిజిటల్‌ వేదికగా సమాచారాన్ని నియంత్రించే చట్టం కాని, స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ కాని లేవు. ప్రింట్‌ మీడియాను ప్రెస్‌కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా, వార్తా చానెళ్లను న్యూస్‌ బ్రాడ్‌కాస్టర్స్‌ అసోసియేషన్‌ (ఎన్‌బిఎ) పర్యవేక్షిస్తున్నాయి. 
 
అదేవిధంగా ప్రకటనలను అడ్వర్టైజింగ్‌ స్టాండర్డ్స్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా, సినిమాలను సెంట్రల్‌ బోర్డ్‌ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌ (సిబిఎఫ్‌సి) నియంత్రిస్తుంది. 
 
కాగా, ఒటిటి ప్లాట్‌ఫామ్‌లను కూడా నియంత్రించేలా ఒక సంస్థను నియమించాలన్న పిటిషన్‌పై గత నెల సుప్రీంకోర్టు ప్రభుత్వ స్పందన కోరింది. ఈ మేరకు కేంద్రం, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ, ఇంటర్నెట్‌, మొబైల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.
 
ఓటీటీ లేదా వివిధ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ ద్వారా ఫిల్ములు, సిరీస్‌ల తయారీదారులు సెన్సార్‌ బోర్డు నుంచి క్లియరెన్స్‌ సర్టిఫికెట్లు పొందకుండానే కంటెంట్‌ను విడుదల చేస్తున్నట్లు పిటిషన్‌లో ఫిర్యాదుదారు పేర్కొన్నారు.    
న‌వంబ‌ర్ 9వ తేదీన కేంద్ర క్యాబినెట్ సెక్ర‌టేరియేట్ రిలీజ్ చేసిన నోటిఫికేష‌న్ ప్ర‌కారం.. ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండే ఫిల్మ్స్‌, ఆడియో విజువ‌ల్ ప్రోగ్రామ్స్‌.. అన్నీ  కేంద్ర స‌మాచార‌, ప్ర‌సార మంత్రిత్వ‌శాఖ ప‌రిధిలోకి రానున్నాయి. ఆన్‌లైన్‌లో క్ర‌మ‌శిక్ష‌ణ సాధించేందుకు ఇదొక్క‌టే మార్గ‌మ‌న్న ఆలోచ‌న‌కు వ‌చ్చారు.
ఆన్‌లైన్‌లో వార్త‌లు, ఓటీటీని ఎలా ఆ మంత్రిత్వ‌శాఖ నియంత్రిస్తుంద‌న్న‌ది ప్ర‌శ్న‌గా మారింది. టీవీల్లో కంటెంట్‌ను నియంత్రించేందుకు ఉన్న కేబుల్ టెలివిజ‌న్ నెట్వ‌ర్క్ రెగ్యులేష‌న్ చ‌ట్టం ఆధారంగా.. ఆన్‌లైన్ కంటెంట్‌కు కూడా రూల్స్ రూపొందించ‌నున్నారు.
టీవీల‌కు అమ‌లు చేస్తున్న‌ ప్రోగ్రామ్ కోడ్ ఇక ఆన్‌లైన్ వార్త‌ల‌కు కూడా వ‌ర్తించ‌నున్న‌ది. టీవీల్లో కంటెంట్‌ను ఎల‌క్ట్రానిక్ మీడియా మానిట‌రింగ్ సెంట‌ర్ ప‌ర్య‌వేక్షిస్తున్న‌ది. అదే విధంగా ఆన్‌లైన్ న్యూస్‌ను కూడా మానిట‌రింగ్ సెంట‌ర్ ద్వారా ప‌ర్య‌వేక్షించే అవ‌కాశాలు ఉన్నాయి. టీవీల‌కు ఉన్న మానిట‌రింగ్ స‌ర్వీసును.. ఆన్‌లైన్‌కు వ‌ర్తింపు చేయ‌నున్నారు.