29 శాతం తగ్గిన మద్యం అమ్మకాలు 

ప్రస్తుత ఆర్థిక సంవత్సర ప్రథమార్ధం (ఏప్రిల్‌-సెప్టెంబర్‌)లో దేశవ్యాప్తంగా మద్యం అమ్మకాలు 29 శాతం తగ్గాయి. లాక్‌డౌన్‌ కాలంలో మద్యం అమ్మకాలను పూర్తిగా నిషేధించడం, ఆ తర్వాత కొన్ని రాష్ట్రాల్లో మద్యంపై భారీగా కరోనా పన్ను విధించడం ఇందుకు ప్రధాన కారణం. 
 
దీంతో ఏపీ, ఛత్తీస్‌గఢ్‌, పశ్చిమ బెంగాల్‌, రాజస్థాన్‌ లాంటి రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి. ‘దేశీయంగా తయారైన విదేశీ మద్యం (ఐఎంఎఫ్‌ఎల్‌) విక్రయాలు ఈ ఆర్థిక సంవత్సర ప్రథమార్ధంలో 29 శాతం క్షీణించాయి. ఆంధ్రప్రదేశ్‌,  ఛత్తీస్‌గఢ్‌, పశ్చిమ బెంగాల్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో డిమాండ్‌ తగ్గడం ఇందుకు ప్రధాన కారణం’ అని చెబుతున్నారు. 
 
ఈ రాష్ట్రాలల్లో ఇప్పటికీ మద్యంపై 50 శాతం కరోనా సుంకం విధిస్తుండటంతో అమ్మకాలు దాదాపు 50 శాతం పడిపోయాయని కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఆల్కహాలిక్‌ బేవరేజ్‌ కంపెనీస్‌ (సీఐఏబీసీ) వివరించింది. 
 
ఈ ఆర్థిక సంవత్సర రెండో త్రైమాసికం (జులై-సెప్టెంబర్‌)లో మద్యం విక్రయాలు పెరిగినప్పటికీ తొలి త్రైమాసికం (ఏప్రిల్‌-జూన్‌)లో లాక్‌డౌన్‌ వల్ల అమ్మకాలు భారీగా క్షీణించాయని తెలిపింది. మద్యంపై కరోనా సుంకాలను విధించని పంజాబ్‌, హర్యానా, ఉత్తరాఖండ్‌, తెలంగాణ, ఉత్తరప్రదేశ్‌ రాస్త్రాలలో అమ్మకాలు పెరిగినట్టు సీఐఏబీసీ వెల్లడించింది.